Sunday 24 May 2015

ఒకరోజు ఒక రైతు కు చెందిన ఒక గాడిద నూతిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా గాని, దానిని రైతు పైకి తీయలేకపోయాడు. ఆ గాడిద సహాయం కోసం ఎంతో అరిచింది. కాని రైతు వల్ల కాలేదు. గాడిద కూడా ముసలిది అయిపోయింది, బావి కూడా పాడుపడినదే కదా అని ఆలోచించి ఆ రైతు గ్రామస్థులందరినీ పిలిచి ఆ బావిని కప్పేద్దాం అని చెప్పాడు. అందరూ పక్కన ఉన్న మట్టిని తవ్వి బావిలో వేయసాగారు. అందరికీ ఆశ్చర్యం కలిగించేలా, బావిలో పడుతున్న మట్టిని ఆసరా చేసుకుని , తనపైన పడుతున్న మట్టిని ఒక్కసారి విదిలించి దులిపేసుకుని, ఆ గాడిద ఒక్కో అడుగు పైకి రావడం మొదలుపెట్టింది. ఆఖరికి చక్కగా బావినుంచి పైకి వచ్చేసింది.
ఈ కథ కూడా మన జీవితం లాంటిదే. జీవితం మనకు ఎన్నో పరీక్షలు పెడుతుంది. ఇరుగుపొరుగు వాళ్ళు మనమీద ఎప్పుడూ బురద తవ్వి పోస్తూ ఉండదానికే ప్రయత్నిస్తారు. ఆ బురద భరిస్తూ, కడుక్కుంటూ అక్కడే ఉండాలా, లేదా ఆ బురదను దులుపుకుని ఒక్కసారి తల విదిలించి పైకి రావాలా అనేది మన చేతిలోనే ఉంది. జీవితం లో ఎదురయ్యే ప్రతి వైఫల్యాన్ని మనం ఒక్కో మెట్టుగా వాడుకొని పైకి రావాలి. ఎదగాలి.వాళ్ళు వేసే బురదను మనం మౌనంగా కడుక్కుంటున్నంత కాలం మనమీద బురద వేస్తూనే ఉంటారు. మన మీద బురద చల్లిన వాళ్ళకు ఆ బురద వారి మీదే పడినట్టు మన ఎదుగుదల ద్వారా సమాధానం చెప్పాలి.
సంతోషంగా జీవించడానికి పంచ సూత్రాలు.
1. మీ హృదయంలో ద్వేషానికి చోటు ఇవ్వకండి---శతృవులను క్షమించండి ( ఇది మీ శతృవులకు చేసె ఉపకారం కాదు. మన మనసు ప్రశాంతంగా ఉండడానికి మనం మనము చేసుకునే సహాయం)
2. మనం చాలా సాధారణంగా ఆందోళన చెందే విషయాలు ఎప్పటికీ జరగవు. అయినా మనం భయపడుతూ ఉంటాము. అటువంటి ఆందోళనలు మనసుని, ఆరొగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయి. అటువంటి ఆందోళనలను పూర్తిగా మనసు నుంచి తొలగించండి
3. ఏదో లేదు అని బాధపడకుండా, ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించండి. జీవితంలో సంతౄప్తి వలన కలిగే లాభం అంతా ఇంతా కాదు.
4.ఉన్నదానిని నలుగురితో పంచుకోవడం అలవాటు చేసుకోండి. సంపదనైనా, సమయాన్నైనా...
5.ఎదుటివారి నుంచి తక్కువ ఆశించండి. ఎందుకంటే, మనం ఆశించినంత ఎప్పుడూ ఎదుటివారి నుండి పొందలేము. అది ప్రేమైనా సరే.....
ఏదైన వస్తువు కొనుక్కునేటప్పుడు మనం మరింత ఆకర్షణీయమైనది, మరింత మెరుగైనదే కొనుక్కుంటాము. మరి ఒకేఒక్కసారి లభించే ఈ జీవితాన్ని మరింత మెరుగ్గా ఎందుకు జీవించకూడదు? మరింత ఆకర్షణీయంగా ఎందుకు మలచుకోకూడదు? ఆలోచించంది.

No comments:

Post a Comment