Sunday 3 May 2015

మా చిన్నప్పుడు వేసవి వస్తే, ఊరగాయలు పెట్టడం ఒక పెద్ద ప్రహసనం, ఒక గొప్ప వేడుకలా ఉండేది. ఒక్కో ఇంట్లో నలుగురేసి పిల్లలు, అంతమందికీ ఉదయం చద్దన్నాలు, అందులో ఊరగాయలు, ఎన్ని కాయలు పెడితే సరిపొతుంది? ఒక్కో ఇంట్లో వంద కాయలు ఆవకాయ పెట్టేవారు. ఈ రోజుల్లో లాగా, ఊరగాయ తినకూడదు, ఉప్పు తినకూడదు, కారం తినకూడదు అనే నియమాలు ఉండేవి కావు. చిన్నా, చితకా, ముసలీ ముతకా అందరూ అన్నీ తినేవారు. అందుకే 100 కాయ ఆవకాయ పడేది ఒక్కో ఇంట్లో. ఇప్పటిలా కారం, ఆవగుండ బజార్లో కొనుక్కుని తెచ్చుకోవడం కాదు, పెద్ద పండుగ హడావిడి అవ్వగానే కొత్త మిరపకాయలు బజార్లో రాగానే, మిర్చి ఎంపికతో మొదలయ్యేది హడావిడి. వరంగల్ మిర్చి, జంగారెడ్డి గూడెం మిర్చి, గుంటూరు మిర్చి అంటూ అందులొ రకాలు.. వెడల్పుగా ఎర్రగా ఉన్న మిరపకాయ కారం ఎక్కువ లేకుండా మంచి రంగుతో ఉండి, సంవత్సరం పొడుగునా ఊరగాయ నల్లబడకుండా ఉండేది. కొంచెం కారం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు గుంటూరు మిర్చి వాడేవాళ్ళు. అవి తొడిమలు తీసి ఎండబెట్టుకోవడం, ఆవాలు బాగుచేసుకుని ఎండలో పెట్టడం, రాళ్ళ ఉప్పు కూడా ఎండలో పెట్టి దంచుకోవడం, ఇవన్నీ పనులే. వేసవి సెలవులు ఆరంభం అవ్వడం పాపం.. ఈపనులు మా నెత్తిన పడేవి. కారం గుండ కొట్టించుకోవడం అదో పెద్ద కార్యక్రమం. ప్రతి ఇంట్లొను కుంది రోళ్ళు అని ఉండేవి. వాటిని ఏడాది పొడవునా ఏ పనులకీ వాడరు. ఈ ఊరగాయ పనుల్లోనే వాడేవారు. అవి ఎండకు ఎండి, వానకు తడిసి, దుమ్ము కొట్టుకుపోయి ఉంటాయి. వాటిని జామ ఆకులతో రుద్ది, దుమ్ము దులిపి శుభ్రం చేయటం పిల్లల వంతు. ఇరుగుపొరుగు 2,3 ఇళ్ళవాళ్ళు కలిసి కారం మనుషులను మాట్లాదుకుని కారం గుండ  రోళ్ళలో కొట్టించుకునే వారు. ఆరోజు ఇల్లాళ్ళూ అందరూ ఆ ఎండ వేడికి, మిరప ఘాటుకి మండిపోతూ ఉండేవారు. అల్లరి చేస్తే పిల్లలకి దరువులు పడేవి ఆరోజు. ఇంక మామిడి కాయ తెచ్చిన రోజు మళ్ళీ పిల్లలకు పనే. కాయ తుడవడం, ముక్కలు కొట్టాక మళ్ళీ తుడవడం, ఇలా ఆరోజు ఆడుకోవడానికి కుదిరేది కాదు. ఎందుకొచ్చిన ఊరగాయరా బాబూ అనుకుంటూ ఏడుస్తూ చేసేవాళ్ళం. కానీ అసలు మజా ఆవకాయ కలిపిన రోజున సాయంత్రం ఉండేది. అన్ని పనులు అయ్యాక, అందరి వాటాల్లోని పిల్లలనీ ఒకచోట చేర్చి, వేడి వేడి అన్నం వండి ఆ కొత్త ఆవకాయ కలిపి, చుట్టూ పిల్లలని కూర్చోపెట్టి, అందరి చేతుల్లో తలో ముద్దా పెడుతుంటే తినడం మహా సరదాగా ఉండేది. మళ్ళీ ఆవకాయల్లో ఎన్ని రకాలని.... వెల్లుల్లి ఆవకాయ, పనస ఆవకాయ, పులిహోర ఆవకాయ, సెనగ ఆవకాయ, పెసర ఆవకాయ, మెంతి ఆవకాయ, బెల్లం ఆవకాయ, ఎండు ఆవకాయ, తొక్కు పచ్చడి, మాగాయ,.... ఎట్సెట్రా ఎట్సెట్రా,...ఇందులో గొల్లపూడి పచ్చ ఆవకాయ మరో విశేషం. ఎంతో రుచిగా ఉండేది. ఇన్ని రకాలు పెట్టి, మళ్ళీ ఇరుగు పొరుగు కు రుచికి ఇవ్వడం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకొంటిని వాయనం అన్నట్టు, వారి ఊరగాయ మనింటికి, మన ఊరగాయ వాళ్ళింటికి.. ఎన్ని రోజులు తిన్నా అవి తెమిలేవి కావు. ఇప్పుడు ఆ రోజులూ కావు, ఆ సందడీ లేదు. ఒక్కొక్కరూ 4 కాయలు, 5 కాయలు,ఊరగాయ.  చద్దన్నాలూ లేవు, ఊరగాయ తిని అరాయించుకునే శక్తీ లేదు ఎవరికీ, అందరికీ సుగర్లూ, రక్తపోట్లూ.. ఇక ఏవీ తినద్దని చెప్పటానికి డాక్టర్లు ఉండనే ఉన్నారు నక్షత్రకుల్లాగ. పోనీ ఈ సరదాలైనా పిల్లలు చూస్తారు అనుకుంటే, పెద్ద పిల్లలు ఎంసెట్ కోచింగులు, చిన్న పిల్లలు సమ్మర్ కేంపులు...వేసవి సెలవుల్లో కూడా పిల్లల నవ్వులు వినే భాగ్యం, పిల్లల అల్లరి చూసే భాగ్యానికి నోచుకోలేదు ఎవ్వరూ. మన పని సజావుగా సాగాలి అంటే వాళ్ళకో ఆండ్రాయిడ్ ఫోన్ ఇచ్చి కూర్చోబెడుతున్నాం. ఈ జ్ఞాపకాలన్నీ తలుచుకుని, ఇలా పదుగురితో చెప్పుకుని మురిసిపోవటమే మిగిలింది...

No comments:

Post a Comment