Sunday 2 February 2014

అక్షయంబుగా కాశి లోపల అన్నపూర్ణ భవానివై
సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవీ
మోక్ష మొసగేడు కనకదుర్గవు మూల కారణ శక్తివీ
శిక్షజేతువు ఘోర భవముల శ్రీ గిరీ భ్రమరాంబికా

ఈ పద్యం ఇప్పటి వాళ్ళకు ఎవరికైనా తెలుసా? మీ ఇంట్లో అడగండి. మీ పెద్దవాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది . ఇది భ్రమరాంబిక అష్టకం లోని పద్యం. పూర్వం వివాహాది శుభకార్యములలొ సహపంక్తి భోజనములు ఏర్పాటు చేసేవారు. అన్ని వడ్డించిన తరువాత అక్కడ ఉన్న పెద్ద వాళ్ళల్లో ఎవరో ఒకరు ఈ పద్యాన్ని గట్టిగా గొంతెత్తి పాడేవారు. ఇది చదివిన తరువాతనే భోజనం మొదలు పెట్టేవారు. మనకు అన్నం ప్రసాదించేది ఆ అన్నపూర్ణా దేవేనని నమ్మకంతో అలా చదివేవారు. అన్నపుర్నాష్టకం లో పద్యాలూ కూడా చదివేవారు.  ఆ పైన వడ్డింపులు కొసరి కొసరి జరిగేవి. ఈ లోపు ఆ శుభకార్యం చేసిన గృహస్తు కానీ, లేక అతని తరఫు నుంచి మరొకరు కాని భోజన సాల వద్దకు వచ్చి అన్ని అందరికి అమరుతున్నాయో లేదో, కనుక్కొని, వీలైతే తను కూడా కొంత సేపు వడ్డించి, అసలే సమయం మించిపోయింది, మెల్లగా భోజనం చేయండి, అని మర్యాద చేసి,  అన్ని వంటకాల రుచులు బాగున్నాయా లేదా అని విచారించుకొని వెళ్ళేవారు. భోజనం పూర్తీ అయిన తరువాత మళ్లీ ఎవరో ఒకరు "భోజన కాలే గోవింద స్మరణం " అని "గోవింద, గోవింద " అని ముమ్మారు స్మరణ చేసి పంక్తి నుండి లేచేవారు. పంక్తి భోజనములు చేసేటప్పుడు పంక్తి లో పెద్దవారు మొదలు పెట్టనిదే, చిన్నవారు భోజనం మొదలు పెట్టకూడదు. అలాగే పెద్దవారు లెవనిదె, చిన్నవారు భోజనం ముగించి లేవకూడదు. అలాగే విస్తరి లో వడ్డించిన అన్ని పదార్ధాలూ ఖాలీ చేయాలి కానీ, నిర్లక్ష్యం గా వదిలివేయరాదు. ఇలా అప్పటి భోజనాలు ఒక పద్ధతిలో జరిగేవి.

కానీ ఇప్పుడు కాలమహిమ అనుకున్న, మార్పు అనుకున్నా, భోజనాల పధ్ధతి మారిపోయింది. ఆడ, మగ ఉద్యోగస్తులు కావడం వలన ఇంట్లో ఏదైనా శుభ కార్యం చేయాలంటే అతిధులు వందల సంఖ్యలో వస్తున్నారు. వీరందరినీ పంక్తి భోజనాలు ఏర్పాటు చేయాలంటే స్థలాభావం తో పాటు సమయాభావం కూడా ఒక సమస్య. కార్యక్రమానికి వచ్చే వందలమందికి భోజనాలు ఏర్పాటు చేయాలంటే 4 గంటలు సమయం పడుతుంది. అంత సమయం పెళ్లికే ఉండడం లేదు. ఇంకా భోజనాలు ఎక్కడ? తొందరగా తిని, వధువరులను ఆశీర్వదించి మళ్లీ ఆఫీసులకు వెళ్లిపోవాలి. అదే రాత్రి ముహూర్తం అయితే తొందరగా హాజరు వేయించుకొని ఏదో తినేసి ఇంటికి వెళ్లి పడుకొని మళ్లీ మర్నాడు ఉద్యోగ సమరానికి సిద్ధం కావాలి. అందుకే శుభ కార్యం చేసేవారికి హడావిడి, వచ్చి చూసేవాళ్ళకి హడావిడి. దీనికి ప్రత్యామ్నాయంగా కనుగొన్నవి బఫే డిన్నర్లు.

ఇదివరకు కూర్చొని భోజనం చేసేవారి వద్దకు వడ్డించేవాళ్ళు వచ్చేవారు. ఇప్పుడు వడ్డించే వాళ్ళు ఒక చోట ఉంటారు. మనం ప్లేట్లు తీసుకోని వారి దగ్గరకు వెళ్లి వేయించుకొని రావాలి. వండే వారెవరో తెలియదు, వడ్డించే వారెవరో తెలియదు, ఇక కార్యక్రమం చేసిన వారికి మనలను పలకరించే తీరిక ఉండదు. మనము తిన్నామో లేదో అడిగే వారుండరు. మనమే వెళ్లి, మనమే భోజనం చేసేసి, మనమే వెళ్లి వాళ్ళని పలకరించి తెఛ్చిన బహుమతి వారి చేతిలో పెట్టేసి, ఒక shakehand  ఇచ్చేసి బయట పడడమే.  ఆ రద్దీ లో ఒకరి ప్లేట్లు ఒకరికి తగులుతూ అదో హడావిడి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తాము. కానీ చెప్పులు విడిచే స్థలం ఉండదు. చెప్పులు వేసుకొనే భోజనం చేయడం. వడ్డించే పదార్ధాలు బోలెడు. తినే తీరిక ఎవరికీ ఉండదు. అందరి ప్లేట్లల్లో సగానికి సగం వదిలి వేయబడి ఉంటాయి. ప్రాణం ఉసూరుమనేలాగా.

ఇదంతా కాల మహిమ అని సర్దుకోవాలేమో. మళ్లీ పూర్వపు రోజులు వస్తే ఎంత బాగుంటుంది?



No comments:

Post a Comment