Monday 24 February 2014

కర్ణాటక సంగీతానికి ఆద్యుడు శ్రీ త్యాగరాజ స్వామి . ఈయన అసలుపేరు త్యాగబ్రహ్మం. 1767లొ శ్రీ కాకర్ల రామబ్రహ్మం, సీతమ్మ దంపతులకు జన్మించారు. వీరి అసలు జన్మస్థలం మన ఆంధ్ర దేశంలోని ప్రకాశం జిల్లా ఖంభం అయినప్పటికిని, వీరి పూర్వీకులు తమిళనాడుకు వలస వెళ్లారు. ఈయన తండ్రి రామబ్రహ్మం తంజావూరు సంస్థానాదీషుడు శ్రీ శరభోజి మహారాజు గారి కొలువులో ఉండేవారు. త్యాగరాజు గారి విద్యాభ్యాసం అంతా తిరువయ్యూరు లో జరిగింది. ఆయన చిన్నతనం లోనే వేదాలు, ఉపనిషత్తులలో ప్రావీణ్యం సంపాదించారు. ఈయనకు రాముని మిద అచంచలమైన విశ్వాసం ఉండేది. త్యాగరాజు గారికి సంగీతం లో ఉన్న అభిరుచిని కనిపెట్టి శొంటి వెంకట రమణయ్య గారు తమ శిష్యునిగా అంగీకరించారు. ఆయనకు సంగీతంలో మెళకువలు శ్రద్ధగా నేర్పించారు.

శ్రీ శరభోజి మహారాజు త్యాగయ్య సంగీత ప్రతిభను గురించి విని రాజాస్థానంలో పాడవలసినడిగా కోరుతూ, అనేకమైన ధన కనక వస్తు వాహనములను త్యాగయ్య ఇంటికి పంపుతారు. కానీ అఖండ రామభక్తుడైన త్యాగయ్య వాటన్నిటిని తిప్పి పంపేసి, తనకు ధనము కంటే, రాముని వాత్సల్యమే గొప్పది అని చెప్తారు. అయన సంగీతాన్ని ధన సంపాదనకు మార్గంగా కాక, భగవంతుని లీలలు గానం చేసే సాధనము అని నమ్మిన వ్యక్తి.

అయితే, రాజుగారి కానుకలను తిప్పి పంపడంతో ఆగ్రహించిన వారి అన్నగారు జపేశుడు, ఆస్తి పంపకం చేసేస్తారు. తన వంతుకు వచ్చిన సీతా, రామ , లక్ష్మణ విగ్రహాలను అయన ఆనందంగా అందుకుంటారు. సాక్షాత్తు రాముడే తన వంతుకు వచినప్పుడు ఇంకా విచారించ వలసిన పని లేదు అని భార్యకు, శిష్యులకి తెలియచేప్తారు. త్యాగరాజుకు వస్తున్న ఆదరణ చూసి ఈర్ష్య చెందిన వారి అన్నగారు దీనికంతటికి కారణం దేవుని విగ్రహాలే అని, దేవుని కరుణ వల్ల త్యాగయ్య ఇంతటి ఆదరణ పొందుతున్నారని భావించి ఆ విగ్రహాలను కావేరి నదిలో విడిచిపెడతారు. త్యాగయ్య తన రాముని అన్వేషణలో దక్షిణ దేశ యాత్రలకు వెళ్లి, అనేక తీర్థ యాత్రలు చేస్తారు. ఆ యా సందర్భాలలో ఆ యా క్షేత్రాలలో ఉన్న దేవుళ్ళ మిద ఆయన ఎన్నో కృతులను రచించారు. ఆ రాముని కృప వలన మళ్లీ విగ్రహాలను నదిలోనే కనుక్కొంటారు.

త్యాగయ్య 96 కోట్ల శ్రీరామ జపం చేసారు. ఈయన సంగీత ప్రావీణ్యాన్ని, రామభక్తిని మెచ్చిన నారద మహాముని స్వయంగా ప్రత్యక్షమై ఈయనకు స్వరర్నవం అనే గ్రంథాన్ని బహుమతిగా ఇచ్చినట్లు చెప్పుకొంటారు. ఈయన గాత్ర సంగీతంలోనే కాక, గొప్ప వైణికుడు కూడా...

త్యాగరాజు మొత్తం మిద 24 వేల కీర్తనలు, కొన్ని ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు, ప్రహ్లాద భక్తీ విజయము, నౌకా చరితము అనే సంగీత నాటకాలు కూడా వ్రాసిరి. ఈయన వ్రాసిన 5 పంచరత్న కీర్తనలు బహు ప్రసిద్ది చెందినవి. ఈయనకు వారసులు లేకపోయినా, వారి సంగీత వారసత్వం ఈనాటికి కొనసాగుతూనే ఉంది. 1847 పుష్య బహుళ పంచమి నాడు శ్రీ త్యాగరాజు గారు పరమపదించారు. ఈయన సమాధి చెందిన తిరువయ్యుర్లో ప్రతి సంవత్సరం శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు చాల విశిష్టంగా జరుపుతారు. ఆయన సమాధి వద్ద అయన రచించిన పంచరత్న కీర్తనలు ప్రముఖ సంగీత విద్వాంసులు అందరు బృంద గానం చేస్తారు. ఎందఱో జంత్ర, తంత్ర, గాత్ర విద్వాంసులు ఇందులో పాల్గొంటారు.

No comments:

Post a Comment