Thursday 6 February 2014

" సత్యం వద, ధర్మం చర" అని మన సంస్కృతీ మనకు నేర్పించింది. సత్యమునే పలుక వలెను, ధర్మ బద్ధుడై చరించవలెను అని దాని అర్ధం.  కాని మనం ఈరోజు అది పాటిస్తున్నామా? అసలు ధర్మం అంటే ఏమిటి? ధర్మం ప్రకారం ఎలా నడుచుకోవాలి?

మన ఋషులు చెప్పిన ప్రకారం, ధర్మాత్ముడైన వాడు 1. సత్యం, 2. అహింస, 3. అస్తేయము ( ఇతరుల వస్తువులు దొంగిలించ కుండుట ) 4. మనో నిగ్రహం 5. చిత్తశుద్ది 6. అపరిగ్రహము ( ఇతరుల నుంచి ఏమి ఆశించకుండుట. అనే ఈ లక్షణములను పాటించాలి.

కానీ, మానవుని అభివృద్ధి పధము నుంచి వెనుకకు లాగేవి. మానవుని ఉన్నతిని అడ్డుకొనేవి మనలోనే కొన్ని శత్రువులు ఉన్నాయి. వాటి పేరే అరిషడ్వర్గములు. అంటే ఆరు శత్రువులు. అవి ఏమిటి అంటే 1.కామ 2 క్రోధ 3. లోభ 4. మోహ 5. మద 6. మాత్సర్యములు. మనిషి యొక్క అంతర్గత శత్రువులైన వీటిని జయించని నాడు మానవుడు ఉన్నతిని పొందజాలడు.

1. కామము : ఏ వస్తువు లేదా విషయము నందు మితిమీరిన కోరికను కామము అంటారు. న్యాయ బద్ధమైన  కోరికలు తీర్చుకోవటం కష్టమేమి కాదు. ఒక కోరికను తీర్చుకోవడానికి కష్టపడుతున్నారు అంటే అది న్యాయబధ్ధమైనది కాదు అన్నమాట. ఈ రకంగా ఒక వస్తువు లేదా విషయము పైన విపరీతమైన ఆసక్తి ఉన్నవారు అది పొందడానికి ఏ పని చేయడానికైనా వెనుకాడరు.

2. క్రోధము.: ఇది అందరికి తెలిసినదే. మితిమీరిన కోపం కలవాడు, ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో తెలుసుకోలేడు. విపరీతమైన కోపం కలిగిన వానికి స్నేహితులు, బంధువులు అందరు దూరం ఐపోతారు.

3. లోభము: అన్ని తనకే కావాలి అనుకునే దురాశను లోభము అంటారు. ఈ లక్షణం కలిగిన వాడు సత్యము, చిత్తశుద్ది, మనో నిగ్రహం అనే విషయాలను పట్టించుకోడు.

4. మోహము: ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము లేకపొవుటే మోహము. ఇది కూడా మితిమీరిన ఆశ వల్ల వచ్చినదే. మోహమునకు గురి అయిన వాడికి, మంచి, చెడు విచక్షణ తెలియదు. తన, పర బేధం తెల్లియదు.

5. మదము: మితిమీరిన అహంకారము, నా అంతటి వాడు లేడు, అనే గర్వము నేను తప్ప మిగిలిన వాళ్ళు అందరు పనికి రానివాళ్ళు అనే భావము కలిగి ఉండడం మదము. ఈ లక్షణము మనిషిని కుదురుగా ఉండనీయదు. అందరిని తేలికగా చూసే అలవాటు వల్ల మిగిలిన వారిచే అసహ్యించుకోబడతారు.

6. మాత్సర్యము : మాత్సర్యము అంటే మితిమీరిన అసూయ. మనం ఎంత బాగున్నా, పక్క వాడి ఉన్నతిని చూసి ఓర్వలేని తనము, వాళ్ళని ఎలాగో అలాగ కించ పరిచే స్వభావము దీని యొక్క లక్షణాలు.

ఇవి మనలో ఉన్న మన శత్రువులు. ఇవి మనిషిని ధర్మం ప్రకారం నడవనీయవు. ఈ లక్షణాలు మనలో ఉన్నపుడు, అన్ని వేళల సత్యము చెప్పలేము. అహింసను పాటించ లేము  ( ఒక ప్రాణిని చంపటమే హింస కాదు, పరుషమైన మాటలతో నిందించి మనసు గాయపరుచుట కూడా హింసయే.) ఇంద్రియ నిగ్రహము , మనో నిగ్రహము కోల్పోతాము, చిత్తశుద్దితో వ్యవహరించా లేము. ఎవరి దగ్గర నుండి ఏమి ఆశించకుండా ఉండలేము. అంటే మనము ధర్మాచరణ చేయలేము అన్నమాట.

దీని తాత్పర్యం ఏమిటంటే, మనలో ఉన్న అరిషడ్వర్గాలను జయించకుండా మనము ధర్మాచరణ చేయలేము. ఇందులో ఇంకొక విశేషం ఏమిటంటే, ధర్మాచరణ చేయకుండా అరిషడ్వర్గాలను జయించే శక్తిని పొందలేము. ఇందుకోసం మనం మన పూర్వులు, మన ఋషులు చెప్పిన వన్నీ పాటించడం నేర్చుకోవాలి. రామాయణ, భారతాల వంటి గ్రంధాలను చదివి అర్ధం చేసుకొని అందులోని ఆదర్శాలను పాటించాలి. రాముడు, భీష్ముడు వంటి మహనీయుల జీవిత చరిత్రలు చదివి సారం గ్రహించాలి. పిల్లలకు చిన్నతనం నుంచి నీతి పద్యాలూ, సూక్తులు బోధించాలి. మన సంస్కృతి సంప్రదాయాలను, ఆచారాలను  అలవాటు చేయాలి.

      "సర్వే జనా స్సుఖినో భవంతు "

No comments:

Post a Comment