Wednesday 12 February 2014

వృద్ధాప్యం: జాగ్రత్తలు.

వృద్ధాప్యం అంటే కుటుంబ బాధ్యతలతో,  ఉద్యోగ విధులలో అలసిపోయిన శరీరానికి విశ్రాంతి నిచ్చే వయసు. పిల్లల బాధ్యతలు తీరిపోయి, మనుమలు, మనుమరాళ్ళతో హాయిగా ఆదుకోవలసిన వయసు. అయితే అందరు అల హాయిగా ఉంటున్నారా అంటే జవాబు లేదు అనే వస్తుంది.

వృద్ధాప్యంలో శారీరిక , మానసిక సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కీళ్ళనొప్పులు, కండరాల బలహీనత, ఎముకల క్షీణత, మతిమరుపు వంటివి సమస్యలుగా ఉంటాయి. అయితే నడివయసు నుంచే చిన్నపాటి వ్యాయామాలు అలవాటు చేసుకుంటే మలివయసులొ ఆరోగ్యంగా ఉండచ్చు. 40-45 సం. వయసు నుంచే అంతకు ముందు అలవాటు లేని వారు కూడా, ఉదయం నడక, తేలికపాటి వ్యాయామాలు చేయడం వలన, మలివయసులొ కండరాల , ఎముకల బాధలు ఎక్కువగా బాధించవు. నడక, వ్యాయామం వలన, మధుమేహం, హై బిపి, వంటివి కూడా అదుపులో ఉంటాయి. పెద్దవాన్నైపోయాను, నావల్ల ఏమవుతుంది, నేనేమి చేయలేను అని ఒకేచోట కదలకుండా కూర్చునే వారిలో వ్యాధుల మిద నియంత్రణ ఉండదు. అటు ఇటు తిరిగి చిన్న చిన్న పనులు చేయడం మూలాన శారీరికంగా పటిష్టం గా ఉంటారు. పుస్తకాలూ చదవడం, పిల్లలతో ఆడుకోవటం, కుటుంబ సభ్యులతో రోజుకి రెండు గంటలయినా ఉల్లాసంగా గడపడం చిన్న చిన్న పజిల్స్, సుడోకు వంటివి solve  చేయటం అలవాటు చేసుకుంటే మానసికంగా కుడా ఉత్సాహంగా ఉంటారు.  రోజు కొద్దిసేపు, కూరలు తీసుకురావడం, లేదా దగ్గరలో ఉన్న గుడికో, పార్కుకో వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. దానివల్ల కొత్త స్నేహాలు,  కొత్త పరిచయాలు పెరుగుతాయి.

పెద్దవయసులొ ఆహారం విషయంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆ వయసులో కాలరీల అవసరం పెద్దగ ఉండదు కాబట్టి ఆహారంలో పిండి పదార్థాలు తగ్గించి ప్రోటీన్లు, విటమిన్లు, ఐరన్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయల సలాడ్లు తీసుకోవాలి. కొద్ది కొద్దిగా ఎక్కువ సారులు ఆహారం తీసుకోవాలి. వెన్న తీసిన పలు ఎక్కువగా తీసుకోవాలి, కాల్షియమ్ సప్లిమెంట్ కోసం. నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణ తప్పనిసరి. వేళకు భోజనం చేయాలి. రాత్రి మంచి నిద్ర పట్టేందుకు వీలుగా తొందరగా భోజనం చేసి విస్రమించాలి.

ఇంటిలో పెద్దవారు ఉన్నపుడు కుటుంబ సభ్యులు కుడా వారి కోసం కొన్ని మార్పులు చేసుకోవాలి,. బాత్రూమ్స్ లో వారు జారిపడకుండా anti -skid  పలకలు వేయించాలి. గబుక్కున పడబోయినా వారికీ ఆసరాగా ఉండేందుకు ఒకటి రెండు రాడ్లు అధికంగా పెట్టించాలి. వారి కోసం వండే ఆహార పదార్ధాలు వేడిగా , తేలికగా అరిగేందుకు వీలుగా ఉండాలి.

మనం ఎంత బాగా పోషణ చేసినా ఆ వయసులో వారికీ సంతృప్తి అవసరం. ఆ రహస్యం కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఉంది. ఆ వయసులో మనం వారికోసం ఏమి కొన్నాము, ఎక్కడికి తీసుకెల్లము అని వారు ఆలోచించరు. అమ్మా, లేచావా, రాత్రి సరిగా నిద్ర పట్టిందా, నాన్నా భోజనం చేసావా, మందులు వేసుకున్నావా, అనే పలకరింపులు వారికీ బలాన్ని ఇస్తాయి. అలాగే మనం మన పిల్లలకు కూడా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని పలకరించడం, రోజులో కొంత సేపు వారిదగ్గర కూర్చొని కబురులు చెప్పడం అలవాటు చేయాలి. పెద్దవాళ్ళని గౌరవించడం పిల్లలకు విధిగా అలవాటు చేయాలి. వారంలో ఒకసారి తీరిక చేసుకుని వారిని బయటకు అంటే దగ్గరలో ఉన్న గుడికో, పార్కుకో తీసుకెళ్లడం అలవాటు చేసుకోవాలి. ఊళ్ళో ఉన్న వారి స్నేహితులను కానీ బంధువులను కానీ పిలిచి ఒక చిన్న గెట్ టుగెదర్ లాంటిది ఏర్పాటు చేయాలి. ఇలాంటి చర్యల వాళ్ళ వాళ్ళు చాల ఉల్లాసంగా ఉంటారు.

పెద్దవారు కూడా, అస్తమాను ఇంటి విషయాల్లో వేలు పెట్టకుండా వారి పరిధిలో వారు ఉండి పెద్దరికం నిలబెట్టుకోవాలి. మారుతున్నా కాలానికి తగ్గట్టుగా కొద్దిగానైనా మారాలి. మనం అస్తమాను పిల్లలని సతాయిస్తుంటే మన గౌరవం మనమే తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. పిల్లల్లో పిల్లల్లా, పెద్దల్లో పెద్దవాళ్ళుగా కలిసిపోయి కాలం గడపాలి.  మీకు , మీ మనవల కాలానికి మధ్య తరాలు మారాయి. ఆ తరాల అంటరాని అర్ధం చేసుకొని మసలుకోవాలి. మా కాలం లో అలా లేదు, ఇలా లేదు అని విమర్శించడం మానుకోవాలి. అనవసరపు చికాకులు తగ్గించుకొని హాయిగా కాలం గడపాలి.

No comments:

Post a Comment