Monday 24 February 2014

శుభోదయం మిత్రులారా....

ఈరోజు మరో రెండు కృష్ణ శతక పద్యాలు చూద్దాం...

క్రూరాత్ముడజామీలుడు
నారాయణ యనుచు నాత్మనందను బిలువన్
ఏరీతి నేలుకొంటివి
ఏరి నీ సాటి వేల్పు లెందును కృష్ణా!

అజామీళుడు బ్రాహ్మణ కుటుంబం లో పుట్టినప్పటికీ, వైదిక కర్మల యందు శ్రద్ధ లేక, చెడు సావాసములు పట్టి మద్య మాంసములకు అలవాటు పడతాడు. తన కుమారునకు నారాయణ అని పేరు పెట్టుకుంటాడు. తన అవసాన కాలంలో ఉద్దేశ్య పూర్వకంగా భగవంతుడిని తలవక పోయినా, తన కొడుకును నారాయణ అని పిలుస్తాడు. కారణం ఏదైనప్పటికీ, తన నామం స్మరించినందువల్ల విష్ణుమూర్తి అజామీలుడికి మోక్షం ఇస్తాడు.

అంతటి దురాత్ముడైన అజామీలునకే మోక్షం ఇచ్చిన ఓ కృష్ణ, నీకు సాటి వచ్చే దేవతలు ఎవరైనా ఉన్నారా అని భావము.

ఆత్మనందనుడు = కొడుకు
వేల్పులు= దేవతలు

చిలుకనొక రమణి ముద్దుల
చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతి పేరం
బిలిచిన మోక్షము నిచ్చితి
వలరగ నిను తలచు జనుల కరుదా కృష్ణా!

ఒక వనిత తన పెంపుడు చిలుకకు శ్రీరామ అని పేరు పెట్టి దానిని అస్తమాను శ్రీరామ అనే పేరుతో పిలువగనే ఆమెకు మోక్షము నిచ్చితివే, అటువంటి నిన్ను స్మరించు మానవులకు తక్కువా కృష్ణా అని భావము.

మిత్రులారా... ఒక విన్నపం.
ప్రతిరోజూ ఈ పద్యాలు పోస్ట్ చేయడం మీకు నచ్చనట్లయితే నాకు తెలియచేయండి. ఆధ్యాత్మికమైన విషయాలు, , సంస్కృతీ సంప్రదాయాల గురించి చాల మంది మిత్రులు పోస్ట్ చేస్తున్నారు. ఈరోజుల్లో చాల మందికి పద్యాల గురించి తెలియడం లేదు అనే భావనతో రోజుకి రెండు పద్యాలు పోస్ట్ చేస్తున్న. నచ్చక పొతే దయచేసి తెలియ చేయగలరు.

No comments:

Post a Comment