Sunday 9 February 2014

గుడికి ఎందుకు వెళ్ళాలి?

గుడికి అందరం దేవుడిని చూడడానికి, ప్రార్థించడానికి వెళతాము.  మన ప్రార్థనలతో మన కోరికలు  తీరతాయి అనే నమ్మకం తో వెళ్తాము. పుణ్యం కోసం వెళ్తాము. కానీ లోతుగా ఆలోచిస్తే ఇందులో ఇంకో పురుషార్థం కూడా ఉంది. అది క్రమశిక్షణ. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? గమనించండి. మనలో ఒక్కొక్కరికి ఒక్కో దేవుడి మిద నమ్మకం. వెంకటేశ్వర స్వామో, బాబానో, హనుమంతుడో, రాములవారో, లేక అమ్మవారో. వారి ఇష్ట దైవాన్ని బట్టి వారం లో ఒకరోజు ఆ యా దేవాలయాలకివెళ్తూ ఉంటాము. రోజూ లేవడానికి, స్నానం చేయడానికి బద్దకించే మనం గుడికి వెళ్ళాలంటే మాత్రం చాలా తొందరగా తయారు అవుతాము. మిగిలిన పనులన్నీ పక్కన పెట్టి ఉదయాన్నే గుడికి వెళ్తాము. కొంత మంది అయితే ఆ రోజు ఉల్లి, వెల్లుల్లి కూడా తినకుండా ఉంటారు. అంటే గుడికి వెళ్ళే ఒక్క రోజే కాకుండా మనం తలచుకుంటే రోజు కూడా తొందరగా లేచి బద్దకించ కుండా మన పనులు చేసుకోగలం అని రుజువు అయినట్టేగా.

ఇంకా ఇంట్లో ఉండే పెద్దవారు రిటైర్ అయినవారు గుడికి వెళ్ళే అలవాటు చేసుకుంటే పుణ్యానికి పుణ్యం. కాస్త కాలక్షేపం కూడా అవుతుంది. మేము ముసలి వాళ్ళం అయ్యాము. ఏమి చేతకావటం లేదు అని అనుకోకుండా ఇంటికి దగ్గరలో ఉన్న గుడికో , పార్క్ కో వెళితే అక్కడికి వచ్చిన మిగత వారితో కొంత కాలక్షేపం జరుగుతుంది. ప్రశాంతత దొరుకుతుంది. ఇంట్లో ఉండే విసుగులు , చికాకులు కొంత సేపు మర్చిపోగలుగుతారు. అక్కడికి వచ్చిన తమ వయసు వారితో స్నేహం కూడా పెరుగుతుంది. కొత్త పరిచయాలు అవడం వలన కొత్త కొత్త ఆలోచనలు పంచుకునే వెసులుబాటు కలుగుతుంది.  నడిచి వెళ్లి, గుడిలో ప్రదక్షిణాలు చేసి, మళ్లీ నడిచి ఇంటికి రావటం వల్ల తెలియకుండానే శరీరానికి వ్యాయామం కూడా అవుతుంది.

వయసుతో నిమిత్తం లేకుండా గుడికి అలవాటుగా వెళ్ళే వారందరికి దైవభక్తి తో పాటు పాపభీతి కూడా పెరుగుతుంది.  అందువల్ల మనస్తత్వాలలొ మార్పు వస్తుంది. కొంత శాంతం, సౌశీల్యం అలవడతాయి. మంచి మాట, మంచి నడవడిక అలవడుతాయి. ఈనాడు సమాజానికి  కావలసినది కూడా అదేగా....

తరచుగా దేవాలయాలకి వెళ్ళడం మూలాన అక్కడ జరిగే హరికథ కాలక్షేపాలు, పురాణ ప్రవచనాలు వినడానికి అవకాశం దొరుకుతుంది. మన పూర్వ గాధలను, పురాణాలను , సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకొనే వీలు ఉంటుంది. మనసు నిర్మలం అవుతుంది. ఇవన్ని కూడా మనలోని అరిషడ్వర్గాలను జయించడానికి ఉపకరిస్తాయి కాబట్టి  ఉన్నతమైన వ్యక్తిత్వం మన సొంతమవుతుంది. జీవితం అభివృద్ది పధం లో సాగుతుంది.



No comments:

Post a Comment