Saturday, 5 September 2015

ఖర్చులు తగ్గించుకోవడం ఎలా??? 1
మనలో చాలామందికి ఆదాయానికి తగ్గ పొదుపు, మదుపు ఉండదు. ఎంత పెద్ద ఉద్యోగమైనా సరే, ఎంత పెద్ద జీతమైనా సరే, అదే సమయంలో చిన్న చిన్న జీతగాళ్ళు కూడా సౌకర్యవంతంగా బ్రతుకుతున్నారు అనిపిస్తుంది ఒక్కోసారి. పెరిగే ధరలతో, రోజురోజుకీ మార్కెట్లో వచ్చే ఆకర్షణలతో, ఆదాయానికి, వ్యయానికి పొంతన కుదరడంలేదు. ఫలితం అప్పులు. ఇక్కడ వారెన్ బఫెట్ చెప్పిన సూత్రం గుర్తు తెచ్చుకోవాలి. ముందు పొదుపు, తరువాతే ఖర్చులు అని చెప్తారు ఆయన. ప్రతినెలా జీతం రాగానే, ఎంతో కొంత పొదుపు చేసి, ఆ తరువాతే మన ఖర్చుల గురించి ఆలోచించాలి. నెలకు 500 లేద 200 తో మొదలుపెట్టినా, ఆ పొదుపు రాబోయే రోజుల్లో పెద్ద మొత్తం అవుతుంది.

ఖర్చులు తగ్గించుకోవడం ఎలా??? 2
ఆదాయానికి, ఖర్చుకి పొంతన కుదరడం లేదు అనుకున్నప్పుడు, తెలియకుండానే అనవసర ఖర్చులు పెరుగుతున్నాయి అనుకున్నప్పుడు, ముందు మనం పెట్టే ఖర్చులకు ఒక జాబితా తయారుచేసుకోవాలి. ఏ ఒక్క చిన్న ఖర్చునూ వదలకుండా చిట్టా తయారుచెయ్యాలి. ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు అనవసర ఖర్చులు చేస్తున్నామో దీనివల్ల తెలుస్తుంది. వాటిని తగ్గించుకుంటే పొదుపు చేసే సొమ్ము పెరుగుతుంది. వ్యక్తిగత బడ్జెట్ వ్రాసుకోవటం మొదట్లో కష్టంగా, విసుగ్గా అనిపించినా, దీర్ఘకాలంలో దాని ప్రభావం తెలుస్తుంది. ఖర్చులను అదుపు చేసుకోవడం తెలుస్తుంది.

ఖర్చులు తగ్గించుకోవడం ఎలా??? 3
ఇంటి అద్దె, వెచ్చాలు, పిల్లల ఫీజులు, కొన్న వస్తువుల వాయిదాలు ఇటువంటివి ప్రతినెలా తప్పని ఖర్చులు. వైద్య ఖర్చులు, తీర్థయాత్రలు, పండుగలు, సినిమాలు, రెస్టారెంట్లు ఇటువంటివి రెండో కోవకి చెందినవి. ఇవి ప్రతినెలా ఉండవు కానీ, అప్పుడప్పుడు పలకరించి పోతాయి. ఇందులొ వైద్యఖర్చులు తప్పించుకోలేము కానీ, మిగతావి తప్పించుకునే వీలు ఉంటుంది. మూడో రకం ఖర్చులు అనుకోకుండా వచ్చే చుట్టాలు, శుభకార్యాలు వంటివి. ఈ రకం ఖర్చులకు రిజర్వ్ గా కొంత డబ్బు పెట్టుకోవడం మంచిది. లేదంటే, వాటికోసం అప్పులు చేయవలసివస్తుంది. మొదటి రకం ఖర్చులకు చెల్లించగా, మూడవ రకం ఖర్చులకు ప్రక్కకు తీసి పెట్టుకోగా మిగిలిన డబ్బులో ఇంకా కొంచెం పొదుపు చేసి, మిగిలిన సొమ్ములో రెండవ రకం ఖర్చులకు ఖర్చుపెట్టుకోవాలి.

ఖర్చులు తగ్గించుకోవడం ఎలా??? 4
మొదట్లో కొంచెం కష్టం అయినప్పటికీ, అనవసర ఖర్చులు తగ్గించుకుని, చేతికొచ్చే ఆదాయంలో కనీసం 10 నుంచి 15 శాతం పొదుపు చేయగలగాలి. ఇదివరకే పొదుపు చేస్తున్నవారు దాని శాతాన్ని మరికొంచెం పెంచుకునే ప్రయత్నం చేయండి. పొదుపు చేస్తున్న సొమ్ములో 20-25 శాతం పిల్లల చదువు, పెళ్ళిళ్ళు వంటి దీర్ఘకాల లక్ష్యాలకు, 25-30 శాతం స్వల్పకాలిక లక్ష్యాలకు మిగిలిన 45-55 శాతం మలి వయసు ఖర్చులకు,సొంత ఇల్లు వంటి లక్ష్యాలకు పొదుపు చేయాలి.

ఖర్చులు తగ్గించుకోవడం ఎలా??? 5.
మహిళలు సాధారణంగా చేసే అనవసర ఖర్చులు...చీరలు, ఆర్టిఫిషియల్ నగలు, షాపింగ్, స్టీలు సామాను, ఇంటికి కావలసిన సామాను. ఇంక మగవారు చేసే ఖర్చులు, సిగరెట్లు వంటి అలవాట్లు, ఫర్నిచర్, సినిమాలు, రెస్టారెంట్లు, ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్ వంటివి. వీటిలో కొంచెం నిదానంగా ఆలోచిస్తే, ఎక్కువ అనవసర ఖర్చులే ఉంటాయి. అంటే అది ఆరోజు కొనకపోయినా పెద్ద నష్టమేమి ఉండదు. అలాంటిఖర్చులు తగ్గించుకుంటే మంచిది. కొన్ని షాపుల్లో సరుకులు ఎక్కువ మొత్థంలో కొంటే కొంత డిస్కౌంట్ ఇస్తారు. పాడవని సరుకులు అలా తీసుకోవచ్చు. ఇంక ఇంట్లో వాడే విద్యుత్ విషయంలో ఆదా చేయ్యవచ్చు. ఇలా ఆలోచించడం మొదలుపెడితే, చినుకు చినుకు కలిసి వరద అయినట్టు, రూపాయి, రూపాయి కలిసి పెద్ద మొత్తం లో పొదుపు అవుతుంది.

No comments:

Post a Comment