Friday, 11 September 2015

విదుర నీతి 4.

మాండవ్య మహర్షి మహాతపస్వి. ధర్మస్వరూపుడు. కేవలం కాలినడకతో ఈ భూలోకంలోని సర్వపుణ్యక్షేత్రాలన్నీ దర్శించిన ఘన చరిత్రుడు. నిరంతర తపోమూర్తి. ప్రశాంతమనస్కుడైన మహర్షి అడవిలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని, పరిసరాలు, ప్రకృతితో సంబంధం లేని విధంగా తపోమూర్తిగా జీవిస్తున్నాడు. అటువంటి రోజులలో ఒకనాడు కొందరు దొంగలు, ఆ అదవికి సమీపంలోని రాజ్యంలొ రాజభవనంలో దొంగతనం చేసి, అది బయటపడటంతో, ఆ రాజభటులనుండి తప్పించుకోవడానికి గాను, ఈ అడవిలోని మహర్షి ఆశ్రమానికి వచ్చారు. వారి రాకను పసిగట్టి రాజభటులు ఆశ్రమం వైపు వచ్చారు. వారి రాకను ముందు ఊహించినట్లు ఆ దొంగలు, అతితెలివిగా, ఏ విధమైన చప్పుడు చెయ్యకుండా పొదలమాటూన దాక్కున్నారు. వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటంటే, మహర్షిని చూసి నమస్కరించి వారు పారిపోతారని. కానీ రాజభటులు ఆశ్రమంలో ప్రవేశించి ముక్కుమూసుకుని తపస్సు చేసుకునే మహర్షిని చూసి, అదొక మాయానాటకంగా తలిచారు. మహర్షిని దొంగల గురించి అడిగి సమాధానం రాకపోవడంతో ఆ ప్రాంతమంతా గలించగా దొంగలు దొరికారు. వారినుండి దొంగిలించిన సొమ్ము స్వాధీనం చేసుకున్నరు. ఆ మునిని దొంగమునిగా, దొంగల నాయకుడిగా తలచారు. ఆయనను బంధించి, దొంగలతో పాటుగా రాజాస్థానానికి తీసుకెళ్ళారు. ఇదంతా జరుగుతున్నా ఆ ముని మౌనంగా ఉన్నరే కానీ ఏమీ మాట్లాడలేదు. ఆ మౌనాన్ని అంగీకార సూచకంగా తలచి, రాజు ఆయనను కొరత వేయమని భటులకు చెప్పాదు. భటులు ఆయనకు కొరత విధించారు. ఆ బాధనంతా మౌనంగా భరిస్తున్నారే తప్ప అప్పుడు కూదా ఒక్క మాట మాటాదలేదు మాండవ్యుడు. తక్కిన మునిబృందం వారిని రాత్రిపూట పక్షుల రూపంలో సందర్శించి, చేయని నేరానికి ఈ బాధను అనుభవించడం ఎందుకు ? రాజును కలిసి విషయం చెప్పండి అన్నారు. దానికి ముని, ఇదంతా కర్మఫలం, అనుభవించక తప్పదు అని చెప్పారు. ఇదంతా రాజభటులు విన్నారు. పరుగున పోయి రాజుకు విషయం చెప్పారు. రాజు దిగ్భ్రాంతి చెంది, శిక్ష రద్దు చేయించాడు. కానీ మహర్షిని కొరత వెసిన మొత్తం తీయడానికి కుదరలేదు. కంఠమందు కొంథ భాగం శూలం ఉండిపోయింది. ఆయన దానికి బాధపడక పోగా, మరింత తీవ్రంగా తపస్సు చేయనారంభించారు. ఆ శక్తి వలన ఆయనకు దివ్యలోకాలను దర్శించే శక్తి కలిగింది. దానిలో భాగంగా ఆయన యముని లోకాన్ని దర్శించి, యముని చూడబోయారు. యముడు ఆయనకు సాదరంగా స్వాగతమిచ్చాడు. తనకు లభించిన శిక్షకు కారణాన్ని తెలుసుకోగోరాడు మాండవ్యుడు. చిన్నతనంలో తూనీగలను ముల్లు గుచ్చి, ఆటలు ఆడి, వినోదించిన కారణంగా ఈ శిక్ష అనుభవించవలసినది అని వివరించాడు యముడు. పసిప్రాయంలో తెలిసీ తెలియక చేసిన తప్పులకు కూడా శిక్ష ఉంటుంది అని యముని ద్వారా తెలుసుకున్న మాండవ్యుడు, ఇక అటుపై బాలలకు 14 సంవత్సరముల వయసు వచ్చేవరకు చేసే పాపములు పరిహారం కావాలి అని , వారిని క్షమించాలి అని సూచించాడు. తనకు శిక్ష విధించిన కారణానికి నువ్వు కూడా ఒక శూద్ర స్త్రీ కడుపున పుట్టి, అవమానాలు, బాధలు ఎలా ఉంటాయొ అనుభవించి, తెలుసుకోవాలి అని యముని శపించాడు మాండవ్యుడు.

ప్రతీప మహారాజు పుత్రుడు అయిన శంతనుడు గంగానదీ తీరప్రాంతంలో ఒక అందమైన స్త్రీని చూసి మొహించి ఆమెను వివాహం చేసుకోగోరతాడు. తన మాటకు అడ్డు వచ్చిన మరుక్షణం అతనిని విడిచి వెళ్ళిపోతాననే షరతు మీద శంతనుణ్ణి వివాహం చేసుకుంటుంది మానవ రూపం లో ఉన్న గంగాదేవి. వశిష్టుది శాపం పొంది భూలోకంలో మానవ రూపం లో గంగా శంతనులకు పుట్టిన అస్టవసువులలో ఏడుగురిని పుట్టినవెంటనే గంగపాలు చేస్తుంది గంగాదేవి. ఆఖరున ఎనిమిదో గర్భాన పుట్టిన దేవవ్రతుని నీళ్ళ పాలు చేసే సమయం లో శంతనుడు ఆమెను అడ్డుకుంటాడు. ఆమె చెప్పిన ప్రకారం, ఆ బిడ్డతో సహా శంతనుని వదిలిపెట్టి దేవలోకానికి చేరుకుంటుంది. అతనే గాంగేయుడు, శాంతనవుడు. కొన్నాళ్ళు పెంచి పెద్దజేసిన తరువాత ఆ బిడ్డను తీసుకువచ్చి, " రాజా! ఇదిగో నీ పుత్రుడు. వశిష్టుల వారి దగ్గర శాస్త్రాలు, వేద వేదాంగ విషయములు క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ధనుర్విద్యలో ఇతనికి సాటి అయిన వారు లేరు" అని శంతనునికి గాంగేయుని అప్పగించి తిరిగి తన లోకానికి వెళ్ళిపోయింది గంగాదేవి.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment