Friday, 11 September 2015

విదుర నీతి 12
విదురుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. ఎదుటివారినేదీ ఆశించకుండా, తనకున్నదానితో సంతృప్తిపడటమే సుఖం. కర్తవ్యమును గుర్తించి, శత్రు, మిత్ర ఉదాసీనులను తగు విధంగా గుర్తించి, ప్రవర్తిస్తూ, ఇంద్రియ పంచకాన్ని స్వాధీనపరచుకునే వారు సదా సుఖమూర్తులై సంతృప్తికర జీవితాన్ని గడుపుతారు. మద్యపానం, మృగయానివోదం, పరస్త్రీలపై ఆసక్తి, పరుషవాక్కు, కౄర స్వభావము, దుష్టబుధ్ధి, ఎదుటివారిని హింసించే బుధ్ధి, జూదమందు ఆసక్తి కలిగినవారికి సుఖమన్నది తెలియదు. వారికంటికి కునుకు రాదు.
ధర్మాలేనో ఉన్నాయి. అన్ని ఆచరిస్తే ఆతడు ఆ పరబ్రహ్మయే. వినక, ఆచరించక, వెక్కిరించి, విసర్జించేవారు, నరకలోక యాతనలకు శాశ్వత నివాసులౌతారు. మనం ఆచరించవలసిన ధర్మాలెన్నో ఉన్నాయి. కర్తవ్య పరాయణులకు సుఖ సంతోషాలు అవలీలగా లభిస్తే, కర్తవ్య విముఖులకు దు:ఖదారిద్ర్యాలు వెంటబడి వేధిస్తాయి. వారికి సుఖ సంతోషాలు ఉండవు.
భోజనం ఎప్పుడూ ఒంటరిగా చెయ్యకూడదు. అలాగే, ఒంటరి ప్రయాణం, విషమసమస్యలకు స్వతంత్ర పరిష్కారం తగదు. లోకం నిద్రించే వేళ మనం మేలుకుని ఉండరాదు. మూర్ఖులకు మంచి పనికి రాదు. మంచివారు వీరికి అసమర్థులుగా కనిపిస్తారు. క్షమాగుణం అత్యంత బలమైనది. శక్తివంతమైనది కూడా! దీనిని పొందినవారు సర్వలోకహితులు, ప్రియులని మరువకూడదు. క్షమాశక్తి, సహన "కత్తి", మహాపదునైనవి. బలమైనవి. ఇవి శాంతి కాముకాలు. సజ్జన సమ్రక్షకాలని గుర్తుంచుకోవాలి. సంసారి కర్మలు చెయాలి. స్త్రీ మాతృస్వరూపిణే కాదు. శక్తి స్వరూపిణి కూడా! ఆమెను ఆరాధించడమే ఈ దేశఘనత. పరస్త్రీ పొందుకోరువాదు, ఇతరుల వద్ద బ్రతికేవాదు, అధములు. విద్వాంసుడు ఎంత ప్రతిభ కలవాడైనప్పటికీ ప్రపంచదర్శనం చెయ్యకుండా ఉంటే అతడు ఎందుకూ పనికిరానివాడే అవుతాడు.
సంపాదన మత్తెక్కించరాదు. దానిని ఘనంగా తలచి విర్రవీగరాదు. అపాత్రదానం చెయ్యకూడదు. ధర్మం తప్పి నడువరాదు. మన సంపాదన మందేననుకుంటే ఆశ్రితులను ఎవరు ఆదరిస్తారు? సంపద కలవారు దానధర్మాలు విధిగా చెయ్యాలి. సంపదలేని వారు తమ నిర్భాగ్యానికి ఎవరినో నింధించకూడదు. సహరంతో గుణశీలాలతో తమ బ్రతుకులను పండించుకోవాలి. ఇతరుల సంపదల నాశించడం, పరస్త్రీల సాంగత్యం, మంచివారిని దూరం చేసుకోవడం అనే ఈ మూడు దోషాలు శాశ్వత నరకహేతువులు. శరణాగత రక్షణ మనధర్మముగా తలవాలి. కుటుంబ పెద్దలను, బ్రతికి చెడ్డవారినీ, అనాధలు, సంతానంలేని అప్పచెల్లేళ్ళను ఆదరించడం మన బాధ్యతగా తీసుకోవాలి.
తల్లి, తండ్రి, గురువు, ఆత్మ, అగ్నిని పంచాగ్నులంటారు. వీటి సేవనం సర్వశ్రేష్టం, ప్రజారక్షణ చెయ్యలేని ప్రభువు, భర్తను నిరంతరం కఠినంగా మాట్లాడుతూ దూషించే భార్య, శిష్యులకు విద్య నేర్పని గురువు, గ్రామ మధ్యంలో ఉండాలని తలచే గోపాలకుడు---వీరందరూ లక్ష్యశుధ్ధిలేనివారు. వీరితో సఖ్యం పనికిరాదు. ఇటువంటి వారిని విడిచిపెట్టమని శాస్త్రం నిష్కర్షగా చెప్తుంది. ఆరోగ్యం, సంపదలు, అనుకూలవతియైన భార్య, చెప్పిన మాట వినే కొడుకు, బ్రతుకడానికి పనికివచ్చే విద్య, మేలుకోరే స్నేహితులు కలవారు, నిజమైన సంపద కలవారు అనుకోవాలి. వారు నిరంతరం సుఖసంతోషాలు పొందుతారు.
విద్య నేర్చుకున్నాక గురువును, వివాహమయ్యాక తల్ల్లిని, కొర్కెలు తీర్చుకుని స్త్రీనీ,నది దాటాక నావికునీ, పని పూర్తయ్యాక సాయపడినవరిని, రోగం తగ్గాక వైద్యునీ మరచిపోవడం లోకసహజం. ఇది తగదు. వీరిని కృతఘ్నులు అంటారు. మంచివారితో స్నేహం, న్యాయమార్గంలో, ధనసంపాదన, పుత్రగాత్రపరిష్వంగం, అనుకూలవతియైన భార్యతో సంగమ, సాటివారిలో కీర్తి, ప్రియంగా పలుకరించే బంధువులు, మహాసభలలో సన్మానం, తలచినదే జరగడం, ఆశించిన ఫలితం పొందడం.....ఇవన్నీ ప్రతిఒక్కరికి సంతోషదాయకాలు.
(ఇంకా ఉంది )

No comments:

Post a Comment