Friday, 11 September 2015

విదుర నీతి 13
ఈర్ష్య, ద్వేషం, కోపం, అసంతృప్తి, అనుమానాలు, ఇతరులపై ఆధారపడి బ్రతకడం, అన్యాయార్జితానికై కలలు కనడం---ఇవి దు:ఖ కారకాలు.ఇంద్రియ నిగ్రహం, శాస్త్ర జ్ఞానం, మేధాసంపత్తి, మితంగా మాట్లాడటం, శక్తి కొలది చేసే దానధర్మాలు, మేలు చేసిన వారియందు సహజ కృతజ్ఞత, ఉత్తమ వంశంలో పుట్టడం, కీర్తి ప్రతిష్టలను అప్రయత్నంగా తెచ్చిపెడుతుంది. ఉన్మత్తుడు, త్రాగుబోతు, కోపిష్టి ఆకలితో అంగలార్చేవాడు, లోభి, భయస్థుడు,కాముకుడు...వీరందరూ అధర్మపరులు. అపరాధులు ఎవరైనా, స్వ, పర బేధం లేకుండా శిక్షించి, ధర్మాన్ని నిలబెట్టేవాడూ, కర్తవ్యాన్ని పాలించేవాడూ అయిన ప్రభువు ఉత్తమ ప్రభువు అనిపించుకుంటాడు. అతని పాలనలో ప్రజలకు సుఖశాంతులు, ప్రభువుకు, ప్రభుత్వానికి మర్యాద, పరువు ప్రతిష్టలు లభిస్తాయి. స్నేహం, వివాహం, వ్యవహారం, సమానులతోనే జరుపుకోవాలి తప్ప, హెచ్చుతగ్గులతో ఉంటే, పరిణామాలు విపరీతంగా ఉండి, సుఖశాంతులను దెబ్బతీస్తాయి.
పనిలేని పొగరుబోతూ, అతిగా తినే తిండిపోతూ, నిద్రాలోలుడూ, ఆశ్రితులను ఆదరించని వాడు, వీరందరూ సమాజానికి హితం చేయలేరు. తేనెటీగ పువ్వులపై వ్రాలి, పువ్వుకు ఏమాత్రం హాని కలుగకుండా అందులోనుంచి తేనె ను సేకరిస్తుంది. తోటమాలి పూలను నలుగకుండా, సుకుమారంగా కోస్తాడు. ఇది ప్రకృతి ధర్మం. అలాగే, ప్రభువు ప్రజలకేవిధమైన ఇబ్బంది, కష్టం లేకుండా పన్నులు వేయాలి. అతినైపుణ్యంతో ప్రభుత్వాన్ని నడపాలి. ప్రభువు ఎప్పుడూ విరిసిన పూలు, పండ్లతో నిండిన వృక్షం వలె ఉండాలి. నిరంతరం నిండుగా ప్రసన్నభావంతో ఉండాలి. రాజు ధర్మపరుడైతే, ప్రజలు కూడా సధ్ధ్దర్మ మూర్తులుగా మెలిగి, రాజ్యానికి, రాజుకు కీర్తిని సంపాధించి పెడతారు. అందుకే "యధా రాజా, తధా ప్రజా" అనే సామెత వచ్చింది. రాజు ప్రజాక్షేమాన్ని మరచి, దుర్మార్గంగా ప్రవర్తిస్తె, ఆ రాజ్యం అతిత్వరలో నాశనం అయిపోతుంది.
దరిద్రుడికి ఆకలి ఎక్కువ. ధనవంతునికి అజీర్ణ బాధలెక్కువ. మద్యపాన మత్తుకన్న ధనమదం, సంపదల మత్తు హెచ్చు. సంపదలు పెరిగేకొద్ది, ఆ మత్తు విపరీతంగా పెరిగిపోతుంది. వాడి మత్తు దిగాలంటే కరిమింగిన వెలగపండు చందాన ఆ సంపదలు హరించుకుపోవాలి. అప్పుడే సత్యం బోధపడుతుంది. ఇంద్రియాలలో అతిముఖ్యమైనది మనస్సు. దానిని జయిస్తే, ఈ విశాల అఖండ విశ్వాన్ని జయించినట్లే! ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకున్నవాడు శుక్లపక్ష చంద్రునివలె దినదినాభివృధ్ధి పొందుతాడు. ఈదేహం రథం, బుధ్ధి సారథి, ఇంద్రియాలు గుర్రాలు. వీటిని అదిమి పట్టడం కాదు. పూర్తిగా అణచివేయాలి. అప్పుడే జీవికి ఉత్తమ ఫలాలు సంప్రాప్తించేది. ఎండు కట్టెలతో కలిసిన పచ్చికట్టె కూడా కాలిపోయినట్లు, దుర్జనుల సహవాసం పొందిన వాడు బాధలను అనుభవించాల్సి ఉంటుంది. ఇంద్రియ లోలురు సుఖపడలేరు.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment