Friday, 11 September 2015

విదురనీతి 10
విదురుడు ఇంకా ఇలా చెప్తున్నాడు. "మహారాజా! ధర్మరాజు ముఖాన గుడ్డ కప్పుకుని వెళ్ళాడు. భీముడు తన భయంకర బాహువులతో, గాలిని చీలుస్తో ఆపదివేల ఏనుగుల శక్తిపరుడు, భూమి కంపించేటట్లు పదఘట్టననలతో అన్నగారిని అనుసరించాడు. అర్జునుడు రెండు చేతులతో ఇసుకను చల్లుతూంటే వళ్ళంతా బూడిద పూసుకుని నకులుడు, తల దించుకుని సహదేవుడు సాగుతుంటే, ఆ వంశమహారాణి ద్రౌపది జుట్టు విరబోసుకుని, విచారవదనంతో భర్తలను అనుసరించింది. ధౌమ్యులవారు సామగానం చేస్తూ పాండవులననుసరించారు" అని చెబితే, ధృతరాష్ట్రుడు "విదురా! వారందరు మన నాశనం కోరుకుంటున్నారు. వారు వెళ్ళడంలోని ఆ రహస్యాన్ని కాస్త వివరించి చెప్పమంటాదు. సమాధానంగా విదురుడు..." మహారాజా! మననాశనం ఎవరు కోరుకోవడంలేదు. మనమే చేసుకుంటున్నాము. జరిగిన అన్యాయానికి ఆగ్రహించిన ధర్మరాజు, తన కళ్ళలోని కోపం ఎవరికైనా ఇబ్బందుల కలుగజేస్తుందేమోనని, ముఖాన గుడ్డకప్పుకున్నాడు. పరమ ధర్మశాంతమూర్తి కదా ఆ ధర్మరాజు.
ఇక మంచి మాట--అనేది లేదు. ఈ బాహుబల పరాక్రమంతో, మమ్మల్ని ఈ స్థితికి తెచ్చిన ఆ దురాత్ములను తప్పక వధించి తీరుతానని ఆగ్రహావేశంతో మహాబాహుబలసంపన్నుడైన భీముడు అన్నగారిని అనుసరిస్తున్నాడు. అర్జునుడు తాను సవ్యసాచి కాబట్టి, రెండుచేతులతో గుప్పిళ్ళతో ఇసుకను జల్లుతూ, మీ మీ శరీరాలను జల్లెడ చేసి హతమారుస్తానని, హెచ్చరిస్తున్నాడు. నకులుడు తన అందమైన శరీరాన్ని చూసి ఎవరైనా "అయ్యో" అని సానుభూతి చూపుతారేమోనని వళ్ళంతా బూడిద పూసుకుని తన శత్రువులీ విధంగా బూడిదలో పొరాడుతారని తెలియబరుస్తున్నాడు.
సహదేవుడైతే, తన ముఖం చూసిన వాళ్ళీ సమయంలో ఆపదల పాలవుతారని తలచి, తలవంచుకుని నడుస్తున్నాడు. ప్రజలు క్షేమంగా ఉండాలని తమ శతృవులు ఇదేవిధంగా తలెత్తలేని దుస్థితికి గురికావాలని సూచిస్తూన్నాడు . చివరికి ద్రౌపదీ మహారాణి అయితే తనవలె, మరణించిన భర్తలకోసం జుట్టు విరబోసుకుని, రాణివాసం పరమ దు:ఖంలో మునిగిపోవాలన్న భావాన్ని ప్రకటిస్తూ, జరిగిన పరాభావానికి తగు ప్రతీకారం చెయ్యాలని, జరగాలని భర్తలను అనుసరిస్తూంది."
ఇదంతా చెప్పి విదురుదు మహారాజుతో " రాజా! ఇప్పటికైనా మించిపోయింది లేదు. పాండవులను పిలిపించు. వారి రాజ్యం వారికొసగి, వారితో ఏ విధంగాను వైరం పెట్టుకోవద్దని నీ కుమారులను హెచ్చరించు. వారి వారి రాజ్యాలలో ఉభయులు సుఖసంతోషాలతో ఉంటారు." అని చెబుతాడు.
మహారాజు అంతా వింటాడు. విదురుని వాక్కు నిజమే అనిపిస్తుంది. అయితే రాబోయే యుగప్రభావం, స్వతహాగా తన ఇంట్లోనే జ్యేష్టునిగా పుట్టిన కలిపురుషుని ప్రభావంవలన, గుడ్డిరాజు, శారీరకంగానే కాదు, మానసికంగా కూడా గ్రుడ్డివాడయ్యాడు.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment