విదురనీతి 32
కార్యసిధ్ధి ఎలా ఉండాలి?
ఒక కార్యాన్ని మనం చేపట్టి దాన్ని సిధ్ధింపచేసుకునే ప్రయత్నం లో పొందే ఫలితం ఉభయతారకంగా ఉండాలి. ఏకపక్షంగా ఉండరాదు.
ఉదాహరణకు, పక్వం కాని ఫలాన్ని కోయడం వల్ల అది తినడానికి రుచిగా ఉండకపోవడమే కాక దానిలోని విత్తు మరో చెట్టు పుట్టడానికి కూడా ఉపయోగపడకుండాపోతుంది. ఇలాంటి కార్యం చేయడం వల్ల తనకూ ప్రయోజనం ఉండదు. ఇలాంటి కార్యం సరైంది కాదు. కార్యసిధ్ధికి మనం కొన్ని ముఖ్యమైన విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రునికి ఈ విధంగా చెప్తున్నాడు.
పూలతోటను ఎంతో శ్రధ్ధతో పెంచి పెద్దచేసిన తోటమాలికి పూలు ఎలాగ కోయాలో తెలుసు. అతడు నేర్పుగా పూలను కోస్తాడే తప్ప, కొమ్మలు విరచడమో, రెమ్మలు తుంచడమో, మొగ్గలను చిదమడమో చేయడు. చెట్టుకు ఎలాంటి హానీ జరుగకుండా తన పని తాను చేస్తూ చెట్టుకు చేటు లేకుండా ఉభయతారకంగా పనిచేస్తాడు.
అలాగే తేనెటీగ కూడా తోటంతా తిరిగి, వివిధ రకానైన పూలమీద వాలి వాటిలోని మకరందాన్ని అతినేర్పుగా తీసుకుంటుందే తప్ప, పూలకేలాంటి హానీ చేయకుండా, ఉభయ తారకంగా "ఫలదీకరణ" జరగడానికి కూడా తోడ్పడుతుంది. అలాగే మనం కూడా ఏదైనా ఎదుటివాడికి హాని జరుగకుండా ఉండేలా నడుచుకుంటూ అతని మనసు రంజింపచేస్తూ మనకార్యం సిధ్ధింపచేసుకోవాలే కాని, బొగ్గులకోసం ఎవరైనా కల్పవృక్షాన్ని మొదలంటా నరుక్కుంటారా? అని విదురుడు ధృతరాష్ట్రునికి నీతిబోధ చేస్తాడు.
ఇక్కడ అర్ధం...పాండవులు కల్పవృక్షాలవంటి వారు. వారితో ఎవరైనా విరోధం తెచ్చుకుంటారా? నీవె మధ్యవర్తిగా ఉండి ఈ కార్యాన్ని ఉభయతారకంగా ఉండేలా చేయవచ్చు కదా! మహాబలులైన భీమార్జునులు తలచుకొంటే చేయలేని పనిలేదు. వారి అండ నీకెంతో అవసరం కూడాను. వారు న్యాయసమ్మతంగా వారికి రావలసిన రాజ్యభాగాన్ని కూరుతున్నారే తప్ప, మీకెలాంటి హాని చేయాలని తలపెట్టలేదు కదా!ఇటువంటప్పుడు నీవు పెద్దవాడిగా ఈ కార్యాన్ని ఇరుపక్షాలకు మేలు కలిగేలా చేయక, వారి రాజ్యాన్ని వారికివ్వక, మౌనంగా హితోక్తులు వింటున్నావు అని విదురుడు అంటాడు.
(ఇంకా ఉంది )
No comments:
Post a Comment