Friday, 11 September 2015

విదుర నీతి 18
సత్యం గురించి విదురుడు ఇలా చెప్పనారంభించాడు. " సత్యం రూపం ఒక్కటే. దానికి భిన్న రూపాలుండవు. సత్యాన్ని విశ్వసించడానికి ఎంతో ధైర్యం ఉండాలి. అసత్యం చాలా ప్రియంగా ఉంటుంది. అది నమ్మదగినది కాదు దానివలన ప్రయోజనం లేదు. అయినా లోకం అసత్యానికై ఎగబడుతుంది. సత్యానికి పై పై మెరుపులుండవు. సత్యం నిగూఢమయినది. నిత్యమినది. కాకులు నల్లగా ఉంటాయి. ఇది లోకసత్యం. తెల్లకాకులను చూసి ఆనందించేవారూ ఉంటారు. కాకి తెల్లగా ఉండడం వలన అది దానివలన సాధించిందేమిటి? లోకానికి ఒరిగేదేవిటి? ఏదీ లేదు. ఒక వింత. అంతే. సత్యానికి ఆడంబరత్వం ఉండదు. సర్వకాలాల్లోనూ ఒక తీరుగానే ఉంటుంది. అది సర్వజన హితమైనది. సత్యాన్ని తెలుసుకోవడం కష్టం. అసత్యం అందుకు విరుధ్ధం. లోకం ఎంత మూఢమైనది? అసత్యం మీదనే ప్రపంచం మోజు చూపుతుంది. అసత్యవాదుల పలుకులు ఆడంబరంగా ఉంటే, సత్యవాదులు మితంగా మాట్లాడతారు. సత్యం రత్నం వంటిది. అందుకే పరీక్షించి మరీ నిర్ధారించాలి. సత్యరక్షణానికి తక్కువ మాట్లాడాలి".
మానవుడు నిర్వర్తించవలసిన విధుల గురించి విదురుడు ఇల్లా చెప్పాడు. "సుఖదు:ఖాలు మానవులందరికీ వద్దన్నా వెంటవచ్చే తోడునీడలు. ఇందులో ఏ ఒకటి వచ్చినా రెండవది పోతుంది. రెండూ అనిత్యాలే. దీన్ని మానవుడు గ్రహించాలి. భగవంతుణ్ణి నమ్మి నీ విధి నిర్వర్తిస్తూ ఉండు. సదా ఈశ్వరెచ్చనుసారంగా వర్తిస్తూ ప్రతి విషయాన్ని నీధర్మంగా, కర్తవ్యంగా ప్రవర్తించు. భవిష్యత్తు గురించి ఎన్నడూ దిగులుపడకు. నీపట్ల, నీవారిపట్ల, పిల్లలపట్ల, మిత్రుల, బంధువులపట్ల ఇరుగుపొరుగు పట్లా ఇలాగే నడుచుకో. ఔదార్యం కలిగి, నీతిపరుడవై, సక్రమమార్గంలో సత్యమార్గాన ప్రవర్తించడం జన్మ ధన్యతకు మార్గం. "
సత్యం భాషంచకుండా అసత్యాన్ని పలికే వక్తకు కలిగే స్థితి ఏమిటో విదురుడు ఇలా వివరిస్తున్నాడు. సవతులు గల స్త్రీకి, ద్యూతంలో ఓఖిన జూదరికీ, జ్భారవాహకుడికీ, రాత్రి వేళల ఏస్థితి కలుగుతుందో, అన్యాయ నిర్ణయాలు చేసేవారికీ అదేస్థితి కలుగుతుంది. గోవు కొరకు, పశువు కొరకు, అశ్వము కొరకు, మనుష్యుని కొరకు అనృతమాడేవాడు క్రమంగా ఐదు, పది, నూరు వేయి, తరాల వరకూ నరకంలో ఉంటాడు. స్వర్ణం కోసం అసత్యం పలికేవాడు బూతభవిష్యత్ఫలాలను కోలొపోతాడు. భూమి కోసం స్త్రీ కోసం అనృతమాడేవాడు తననే సర్వనాశనం చేసుకుంటాడు".
కనుక మహారాజా! ఇందులోని విధివిధానాలను విన్నారు కదా...అందుచేత మీరు మీ కుమారులకోసం, స్వార్ధాన్ని విడనాడండి. మనస్సుని నిర్మలం చేసుకోండి. అసత్యమాడకండి. అసత్యమాడి సర్వనాశనానికి దారి తీయకండి.
(ఇంకా ఉంది )

No comments:

Post a Comment