Friday 11 September 2015

విదురనీతి --1.
ధృతరష్ట్రుడు నిద్ర రాక రాత్రి, విదురుని పిలిపించగా ఆ విదురుడు అతని మనశ్శాంతి కోసం, ముందు ముందు హితవు, శ్రేయస్సు కలిగే నీతులు చెపుతాడు. భారతంలో అత్యంత ప్రాచుర్యం గలది విదుర నీతి. ఇది ఒక్కసారి కాదు--వందసార్లు చదివి తీరాల్సిన అపూర్వ మహోపదేశం. దేశదేశాలవారిన్ ఆకర్షించిన మహాభారతంలోని "విదురనీతులు" అనేకానేక భాషల్లోకి అనువదించబడ్డాయి. నిలక్షణమైనది విదురుని పాత్ర....ఇక విదురనీతులు--ఆచంద్ర తారార్కం శాశ్వత సత్యాలు.
ఇక చదవండి..
సాదువులు సత్కర్మల వల్ల, రాజు రాజ్యభోగాల వల్ల సుఖులఔతారు. పాపాత్ములతో సాంగత్యం గల సజ్జనులు కూడా దండనార్హులే అవుతారు. ఎండిన కట్టెతో కలిస్తే పచ్చికర్రకు కూడా అగ్నిబాధ తప్పదు కదా! అందుచేతనే దుర్జన సాంగత్యం మంచిది కాదు. ఇంద్రియలోలుని ఆ ఇంద్రియాలే ఆరగిస్తాయి. గుణగ్రహణమూ,సరళస్వబావమూ, పవిత్ర హృదయమూ, సంతోషబావమూ, మృదువచనమూ, సత్యవ్రతమూ, ఇంద్రియ సంయమనమూ, దుష్టుల దరిచేరవు. ఆత్మ జ్ఞానమూ, క్రోధరాహిత్యమూ, సహనశీలమూ, వాగ్దాన రక్షణా, దానశీలమూ, ధర్మపరాయణతా అధములకు పట్టవు. విద్వాంసులని నిందిస్తూ మూర్ఖులు సంతోషిస్తారు. ఎదుటివానిని నింధించడమే స్వబావంగా కలవాడు మహాపాపి. నిందలను సహిస్తూ వారిని క్షమించేవాడు పుణ్యాత్ముడు. హింస దుష్టులకు బలం. దండనీతి రాజులకు బలం. సేవ స్త్రీలకు బలం. క్షమ గుణశీలికి బలం.
వాక్కును స్వాధీనములో ఉంచుకోవడం కంటె కష్టమైనది లేదు. చమత్కార యుక్తులతో, విశేషార్ధాలను ప్రతిపాదించగల మాట మితంగానే ఉంటుంది. సరస సంభాషణం కళ్యాణప్రదమే అవుతుంది. అదే విషయం కటూక్తులతో అంటే పరుషవాకులతో ఉంటే అనర్ధదాయకమవుతుంది. గొడ్డలి దెబ్బలు తిన్న అరణ్యం చిగిరించవచ్చు. కానీ కటువచనాలతో దెబ్బతిన్న హృదయం కోలుకోదు.
మాటే మంత్రమని పెద్దలు చేబుతారు. మహత్తరంగా మాట్లాడిన మన మాటలకు ఎదుటివారు మంత్రముగ్ఢులవుతారు. సమస్త చరాచర జీవరాశిలో "పలుకు" మానవుడికిమాత్రమే లభించిన ఒక అమూల్యమైన వరం. తన మనసులోని భావాన్ని ప్రకటించడానికి ఉపయోగపడే పరమాధ్బుత సాధనం. ఈ అసాధారణమైన అవకాశానికి మారుపేరు వాక్కు! వాక్కు అమోఘమైంది. పరమ పవిత్రమైంది. శక్తివంతమైంది. దుర్లభమైంది. అజ్ఞానాన్ని పారద్రోలేది. జ్ఞానమొసగేది. ఇది వాగ్దేవతకు ప్రతిరూపమైంది. సంస్కృతీ సంస్కారం వాక్కుపై ఆధారపడి ఉంటుందనేది అందరూ ఎరిగిన విషయమే!
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment