Friday 11 September 2015

విదుర నీతి 35
కొందరికి ఎప్పుడూ దు:ఖమే. దు:ఖం వాళ్ళ జీవితంలో ఒక భాగం. ఎందుకంటారా? వాళ్ళెపూడూ ఈర్ష్య, అసూయలతో రగిలిపోతూ ఉంటారు. పరహితం గిట్టదు. దీనంగా ఉంటారు చూడడానికి. వాళ్ళ మీద వాళ్ళకే జాలి, సానుభూతి, ఎంతౌన్నా లేదనో, సరిపోదనో, అసంతృప్తితో అల్లలాడుతుంటారు. వాళ్ళకి ఎప్పుడూ అసంతృప్తే ఎప్పుడూ పరగడుపే. అస్తమానూ కోపంతో ఉంటారు. శాంతంగా ఉండడం చాతకాదు. పైగా నిత్యశంకితులు. అందరిమీదా అనుమానం. అన్నిటిమీదా అనిమానం. ఈఅ అవలక్షణాలకు తోడు, ఇతరుల సొమ్ముమీద బ్రతికేయాలని నీచ స్వభావం. ఇక చెప్పేదేముంది? వీళ్ళు పనికిమాలిన వాళ్ళను సహాయకులుగా నియమించుకొని, వారి సలహాలు వింటుండడం వలన పాలకులుగా పాడైపోతారు.
గారం చేయడం వలన కొడుకు పాడైపోతాడు. కొరగాని కొడుకువల్ల కులం చెడిపోతుంది. చెడ్డవాళ్ళని సేవించడం వల్ల మనుషుల్లో మంచితనం పోతుంది. త్రాగితే సిగ్గుపోతుంది. భర్యాభిడ్డలకు దూరంగా, దేశంకాని దేశంలో ఏళ్ళ తరబడి ఉంటే ప్రేమానురాగాలు సన్నగిల్లుతాయి. దుడుకుతనం వలన సజ్జన స్నేహం చెడుతుంది. అవినీతివల్ల ఐశ్వర్యం పోతుంది. అజాగ్రత్త వలన పరాకు వలన డబ్బు పోతుంది. ఈ మాట విదురుడు పదే పదే చెపుతాడు.
గోవులు, సేన, వ్యవసాయం, భార్య, విద్య, స్నేహం అనే ఆరింటిని జాగ్రత్తగా కాపాడుకోవాలిట. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా చెడిపోతాయట. గోవులకు మంచి గ్రాసాన్ని , పుష్టికరమైన పదార్ధాలను పెట్టి రక్షించుకోవాలి. అయోగ్యుల, సేవించరాని వారి సేవ చేయకుండా ధర్మపరుల్ని ఉత్తముల్ని సేవించాలి. సరైన పెత్తనంతో వ్యవసాయాన్ని రక్షించుకోవాలి. భార్య పట్ల ప్రేమకలిగి ఉండి ఆవిడ అచ్చట ముచ్చట తీరుస్తూ ఆమెను దగ్గర చేసుకోవాలి. అబ్యాసంతో విద్యను పెంపొందించుకోవాలి. ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, మంచి స్నేహితులుండటం నిజంగా గొప్ప. సజ్జనస్నేహాన్ని నిలుపుకోవటానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆస్నేహం అమృతసమానం కాబట్టి.
(ఇంకా ఉంది )

No comments:

Post a Comment