Friday 11 September 2015

విదురనీతి 3.
సర్వసమర్ధుడు, అపకారికి ప్రతీకారం చేయగలిగి కూడా సహనంతో ఉండటం, తాను నిర్ధనుడైనను కోరినవారి కోరిక తీర్చేవారిని పుణ్యపురుషులు అని పెద్దలు చెపుతారు. ఎందువల్లనంటే మంచివాళ్ళని ఏదో విధంగా దూషిస్తూ ఉండటం కొంత మందికి సహజ ప్రవృత్తి. సజ్జనుడు తనని శారీరకంగా గానీ, వాక్కులతోగానీ దూషించిన వారిని ఉపేక్షించి ఊరుకుంటాడు. తనకి శక్తి ఉన్నా ప్రతీకారం చేయడు. అలాగే తను దీనావస్థలో ఉన్నా ఎవరైనా కావాలని కోరగానే దగ్గర ఏది ఉంటే అది ఇచ్చేసే దానగుణం కొద్దిమందిలో ఉంటుంది. ఈ రెండూ పుణ్యపురుషుల లక్షణాలు.
అల్పుడు ఆడంబరముగా పలికినా ఆ మాటల్లో అతని శక్తిహీనత, దుర్జనత్వము అంతర్లీనముగా తొంగిచూస్తూనే ఉంటాయి. మల్లెపొదలు చూడగానే ఆకర్షిస్తాయి. మనం వాటి సమీపానికి వెళ్ళి పూలు కోసుకునేందుకు ప్రయత్నిస్తాము. ఆ తెల్లని పొదలమాటున పాములు దాగిఉన్న సంగతి ఆ క్షణంలో గ్రహింపుకు రాదు. మనుషులలో సైతం లోపల ఎన్ని దుర్గుణాలున్నా అవి వెలుపలికి కలిపించవు. ఒక వ్యక్తి నడవడి, మాటతీరు, నిదానంగా పరిశీలిస్తే కానీ అతడు ఎటువంటివాడో తెలియదు. కనుక ఎవరి విషయం లోనూ మంచి వాడనిగానీ, చెడ్డవాడనిగానీ తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదు.
మాట్లాడుట కంటే మౌనము మేలంటారు. మాట్లాడినది సత్యమేయగుట రెండవపధ్ధతి. సత్యము, ప్రియమునైనది మూడవ పధ్ధతి. ధర్మమును వీడనిదగుట నాలుగవ విధము. ఎదురుతిరిగి పలుకకుండుట--మౌనము కంటె సత్యవచనము, అది ప్రియవచనమగుట, అట్టిది ధర్మబధ్ధమగుట మిక్కిలి శ్రేయస్కరమని తాత్పర్యము.
మహారాజా! నీ కొడుకులు పాండవులను విరోధ దృష్టితో చూస్తున్నారని మరచిపోకు. సర్వసద్గుణ సపన్నుడైన ధర్మరాజు త్రిలోకాధీశుడు కాగలడు. ధర్మార్ధవిదుడూ, తేజస్సంపన్నుడూ, ధీమంతుడూ, భాగ్యశాలీ అయిన ధర్మజుడు మీయందు గల గౌరవభావంచేత యెన్ని కష్టాలయినా సహించాడు. అది మరువకండి. అన్నాడు విదురుడు.
మనిషి లోకానికి బందీయై స్వేచ్చ కోల్పోతున్నాడు. ఫలితంగా దు:ఖం, నైరాశ్యం. ఇది పద్మవ్యూహంలాంటి అవస్థ. లోనికి వెళ్ళగలిగినా బయట పడటం కష్టం. లోపల బంధాలు, బాహంధవ్యాలు, కోరికలు అనే విష సర్పాల్తో పోరాడాలి. విజయులై బయటకు రావాలి. అలా జరగాలంటే సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. దానికి విజ్ఞులు, వేదాంతులు ఏర్పరచిన తోవే--ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక మార్గంలో నడవాలంటే మనిషి జీవితగమనం తామరాకుపై నీటిబొట్టులా ఉండాలంటారు. అంటే భౌతికంగా ఇన్ని బంధాలు బాధ్యతలు ఉన్నా తనలోపల మాత్రం ఎవరికీ, దేనికీ చెందకుండా నిర్వ్యామోహంతో ఉంటేనే తటషుడై సంతోషం, శరీరానికి, మనస్సుకు ఆనందం.
(ఇంకా ఉంది )

No comments:

Post a Comment