Friday, 11 September 2015

విదురనీతి 9
ఓడిపోయేకొద్దీ పంతం, పట్టుదల పెరిగే ద్యూతక్రీడలో కాలం వంచించినట్లు "ఆహ్వానించిన వారిని కాదనరాదన్న" ద్యూతక్రీడ నియమంతో ద్రౌపదితో సహా సర్వం పోగొట్టుకునేసరికి, అధర్మానికి అక్కడ పట్టాభిషేకం జరిగినట్లయింది. గర్వం తలకెక్కిన దుర్యోధనుడు పగలబడి నవ్వుతూ, అందర్నీ విడిచి, కేవలం విదురుని అధిక్షేపిస్తూ--
"చూసావా విదురా! పాంచాలి ఇప్పుడు మాకు దాసి. ఆ ఆజ్ఞాబధ్ధంగా మా సభాప్రాంగణం శుభ్రం చేసే ఒక సాధారణ పరిచారిక. తెలిసిందా? వెళ్ళు. వెళ్ళి, ఆ దాసీదానిని తీసుకురా!" అంటాడు. సభామర్యాదను మొత్తం మంటకలిపిన దుర్యోధనుడి ప్రవర్తనకు విదురుడు ఆగ్రహించాడు. మండిపడుతూ "మూర్ఖుడా! నీతిబాహ్యమైన ఈ చర్యతో నీ చావుకు తొందర తొందరగా ముహూర్తం పెట్టుకుంటున్నావు. తగని పనికి తెగ ఉత్సాహం, ఆరాటంతో బరితెగించి మరీ ప్రవర్తిస్తున్నావు. ఈ వంశానికి జ్యేష్టుడైన ధర్మరాజు నీకు దాసుడా? మిగిలిన సోదరులు, వారి భార్య ద్రౌపది నీకు దాసులా? ఇది మతిఉండే మాట్లాడుతున్నావా? నీ తండ్రి మౌనం, నీ చేష్టలు లోకక్షేమానికి కాదు, వినాశనానికి దారిచేస్తున్నాయి. ఆ నరపతి తన గుడ్డిప్రేమతో, పుట్టగానే ఉత్పాతాలు ఉత్పన్నం చేయించిన పుత్రుని ఆనాడే విడిచి, వంశరక్షణకు పూనుకోక, పెంచి పెద్దచేసుకుని, ఇదిగో ఇటువంటి తంపులకు, తలవంపులకు మహామహులు పాలించిన వంశనాశనానికి పాల్పడుతున్నాడని, కళ్ళెర్రచేసి హెచ్చరిస్తుంటే,
"నువ్వో ధర్మవేత్తవు! జాగ్రత్త! మాటలు కోటలు దాటి, ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకు" అని ప్రతిగామి వైపు చూసి, " ఈ పిరికిపంద, ఆ పాండునందనులను చూసి వణికిపోతున్నాడు. నువ్వు వెళ్ళి ఆ దాసిని, ఒకనాటి పాండుపుత్రుల రాణిని తీసుకుని రా, వెళ్ళు" అన్నాడు.
విదురుడు నెత్తిమొత్తుకుంటాడు. తర్వాత ద్రౌపదీ దేవిని సభకు లాక్కుని రావడం, అక్కడ జరిగిన పరాభవానికి కోపంతో ఊగిపోతూ భీముడు దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం తాగుతానని, దుర్యోధనుని తొడలు విరుస్తానని ప్రతిజ్ఞ చేయడంతో ఆ సభాభవనంలో కలకలం చెలరేగింది. ఈ ప్రతిజ్ఞలను విన్న విదురుడు, తన ధర్మమగా లేచి "ప్రతీపమహారాజు వలన ఉడ్ఢరింపబడిన ఈ వంశం ఇప్పుడు తన పవిత్రతను కోల్పోయింది. దారుణ ప్రళయానికి దారిచేస్తుంది. ఈ జరిగినదంతా, నిజం చెప్పాలంటే వినాశనకారణమే. దీనిని మహారాజు ఎలాగ నిర్వహింపచేస్తున్నాడో, భరింపరాని ప్రమాదాలకు దారితీస్తున్నాడో అర్ధం కావడం లేదు.
నిండు సభలో భరతవంశ కోడలికి వస్త్రాపహరణమా? కురువంశ భూషణులమనే మహారాజుతో కల్సిన పెద్దలు కళ్ళతో చూస్తూ మౌనం వహించడమా? ఇది తగునా? అని గొంతెత్తి మరీ అడుగుతున్నాడు. విదురుని ఘోష అరణ్య రోదనే అయింది.
తర్వాత, గాంధారిదేవి విదురుల ఆలోచనతో ధృతరాష్ట్రుడు తప్పనిసరి పరిస్థితులలో వారి రాజ్యం వారికిచ్చి ఊరడించి, వారు నా పుత్రులు, నీకు సోదరులు, వారిని కరుణించమని ధర్మరాజు, ఈ వంశానికి పెద్దకోడలివి, పెద్దమనసుతో నా పుత్రులను క్షమించమని ద్రౌపదినీ కోరుతాడు.
ఇంతా జరిగాక, కొంతకాలానికిమళ్ళీ, "పెదనాన్న మాట" అంటూ మరల ద్యూతం, అందులో పాండవులు ఓడిపోవడం, అడవులకు వెళ్ళడం విన్న ధృతరాష్ట్రుడు, విదురుని పిలిపించుకుని " ఏమిటీ ఈ దుర్నిమిత్తాలు అని అడుగుతాడు. విదురుడు, ప్రశాంత మనసుతో, మనం చేతులారా చేసుకున్న స్వయంకృత అపరాధం అని, పాండవులు మహాకోపంతో శాపాలు పెడుతూ వెళ్ళారుట. అని చెప్తాడు. కళ్ళు లేనివాడిని, కొంచెం ఆ వివరాలు చెప్పమని విదురుని కోరతాడు.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment