Saturday, 5 September 2015

 ఈకథ తప్పకుండా చదవండి.

ఓరోజు ఉదయం నేను పేపర్ చదువుతుండగా నా భార్య కేకేసింది. "ఎంతసేపూ పేపర్ పట్టుకుని కూర్చోవడమేనా? మీ ముద్దుల కూతురు ఏమి తింటొందో చూస్తారా కొంచెం?"

ఏదో విషయం ఉంది అని నాకు అర్ధమై పేపర్ విసిరేసి వెళ్ళాను. అక్కడ నా గారాలపట్టి సింధు, బేల ముఖంతొ ఉంది. దాని ఎదురుగా ఒక చిన్న గిన్నె నిండుగా పెరుగన్నం...దాని కళ్ళల్లో నీళ్ళు. నా కూతురు అని చెప్పడం కాదు కానీ, సింధు చాలామంచి పిల్ల. తెలివైనది. చురుకైనది. ఒక స్పూన్ తో పెరుగన్నం తీసి ఆమె నోట్లో పెడుతూ, నా బుజ్జి కదూ, బంగారం కదూ...నాన్నకోసం ఒక్క ముద్ద తినమ్మా...అని బ్రతిమిలాడాను. సిందు కొంచెం మెత్తబడింది. కళ్ళ నీళ్ళు తుడుచుకొని  "సరే నాన్నా! ఒక్క ముద్ద కాదు. అంతా తినేస్తాను. మరి తిన్నాకా, నేను ఏది అడిగితే అది ఇస్తావా?" అండి. "తప్పకుండా. నువ్వు ఏది కావాలంటే అది." నేను నా చిన్నారి లేత చేతిలో నా చెయ్యి వేసి ప్రమాణం చేసాను.

అయితే నేను కొంచెం కంగారు పడ్డాను. "సింధు, మరి నువ్వు కంప్యూటర్ లాంటి ఖరీదైన వస్తువులు అడగకూడదు. మీ నాన్న దగ్గర అటువంటి ఖరీదైన బహుమతులు కొనేంత డబ్బు లేదు . సరేనా!" అని తనని అడిగాను. "లేదు నాన్నా, నేను అడిగేది ఖరీదైనదేమీ కాదు." అని చెప్పి, నెమ్మదిగా, కొంచెం కష్టంగా మెల్ల మెల్లగా ఆ గిన్నెడు పెరుగన్నం తినడం పూర్తి చేసింది. నాకు నా భార్యమీద, అమ్మమీద పిల్లకు ఇష్టం లేనిది పెట్టి తినమని బలవంతం చేసినందుకు కొంచెం కోపం కూడా వచ్చింది. సింధు నాదగ్గరికి వచ్చింది. తన గుండ్రమైన కళ్ళు ఒక ఆశతో నిండి ఇంకా పెద్దగా, గుండ్రంగా  కనిపిస్తున్నాయి. అది ఏమడుగుతుందా అని మేమందరం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మా అందరికీ ఎక్సైటింగ్ గా ఉంది.

" నాన్నా! నేను ఈ ఆదివారం జుట్టు తీయించుకుంటాను. గుండు చేయించుకుంటాను." అని అంది సింధు. మేమందరం షాక్ అయ్యాం. " ఇంటి ఆడపిల్ల జుట్టు తీయించుకోవటమా? కుదరనే కుదరదు." అరిచింది నా భార్య. "ఈ దారుణం మన ఇంటా వంటా లేదు. టీవీ చూసి చూసి ఈ పిల్ల ఇలా తయారయింది, మన ఆచారాలు, సంప్రదాయాలు మంటగలుపుతోంది." మా అమ్మ కంగారు.

"సింధు, ఎందుకు అలా అంటున్నావు? ఇంకోటేదైనా కోరుకో. మేము నిన్ను జుట్టు లేకుందా చూడలేమమ్మా...మమ్మల్ని అర్ధం చేసుకొ. " బాధగా అన్నాను నేను. "నాన్నా! నేను ఇష్టం లేకపోయినా ఆ పెరుగన్నం ఎంత కష్టపడుతూ తిన్నానో చూసావు కదా  నాన్నా.....నువ్వే కదా, ఆ అన్నం తింటే నేను అడిగినది ఇస్తాను అన్నావు. ఇప్పుడు మాట తప్పుతావా? నువ్వే కదా నాన్నా, నాకు హరిశ్చంద్రుడి కథ చెప్పావు. ఎన్ని కష్టాలు పడినా చేసిన ప్రమాణం నిలుపుకోవడమే కదా నాన్నా అందులో నీతి?" అని అడిగింది. "సరేనమ్మా! నేను కూడా నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను." ధృఢంగా పలికాను. "మీకేమైనా మతి పోయిందా, చిన్న పిల్ల ఏదో అడిగితే చేయడమేమిటి" నా భార్య, అమ్మ ఒకేసారి  అరిచారు.

"లేదు, ఇప్పుడు మాట మారిస్తే, అది ఎప్పుడూ మనలను నమ్మదు. సింధు, నీ కోరిక తప్పకుండా తీరుతుంది." ఆదివారం జుట్టు తీయించాక, అసలే గుండ్రంగా ఉండే సింధు మొహం జుట్టులేకుందా మరింత గుండ్రంగా, అందులో పెద్ద పెద్ద కళ్ళతో ఇంకా ముద్దొస్తోంది.

మరునాడు  సోమవారం ఉదయం సింధును స్కూల్ దగ్గర డ్రాప్ చేద్దామని వెళ్ళాను. తను నాకు బై చెప్పి, క్లాస్ లోకి వెళ్తోంది. వెనుక నుంచి ఒక అబ్బాయి గొంతు. " సింధుజా, నేను కూడా వస్తున్నా ఆగు!" అంటూ. నేను వెనుకకు తిరిగి చూసాను. తలమీద ఒక్క వెంట్రుక కూడా లేకుండా ఒక అబ్బాయి. "ఓహో! ఇదా కారణం!" అనుకున్నాను. ఆ కారులోంచి ఒక మహిళ దిగి నాదగ్గరికి వచ్చింది. "మీ అమ్మాయి సింధుజ చాలా గొప్ప హృదయం కలది. తనతో పాటు ఉన్నవాడు మా అబ్బాయి. అతను లుకేమియా తో బాధపడుతున్నాడు." ఆమె తన దు:ఖం దాచుకోవడానికి అన్నట్టు కొంతసేపు ఆగింది.

"మా అబ్బాయి అనారొగ్యం కారణంగా క్రిందటి నెల అంతాస్కూలుకి రాలేదు. కీమోథెరపీల వల్ల అతని జుట్టు అంతా రాలిపోయింది. తోటివారు ఏడిపిస్తారనే భయంతో తను స్కూలుకి రావడానికి ఇష్టపడటం లేదు. మీ అమ్మాయి క్రిందటి వారం మా ఇంటికి హరీష్ ని చూడడానికి వచ్చింది. మా బాబు సంగతి తను చూసుకుంటాను అని, నన్ను బెంగపడవద్దని చెప్పింది."

అయితే, మా అబ్బాయి బాధపడకుండా ఉండటం కోసం, అంత అందమైన జుట్టుని త్యాగం చేస్తుంది అని నేను ఊహించలేకపోయాను. అంత నిర్మలమైన హృదయం కలిగిన బిడ్డను కన్నారు.మీరు మీ భార్య అదృష్టవంతులు."

నేనేమీ మాట్లాడలేకపోయాను. కళ్ళల్లో నీళ్ళతో వెళుతున్న నాకూతురివైపు అలాగే చూస్తూ ఉండిపోయాను. చిట్టితల్లీ, నిస్వార్ధమైన ప్రేమ అంటే ఏంటో నువ్వు నాకు చెప్పావు తల్లీ!...

ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉండేవారెవరు అంటే, తనకున్న దాంట్లో జీవించేవారు కాదు, పరులకోసం జీవించేవారు.......


************

1 comment:

  1. నమస్కారం,

    ఇంతటి గొప్ప విలువలతో పెంచుతున్న మీకు, మీ చిన్నారికి మా హృదయ పూర్వక నమస్కారాలు.

    ReplyDelete