Friday, 11 September 2015

విదుర నీతి 15
స్త్రీలను అవహేళన చేసి నిందించేవారు, పరాభవించేవారు, దానం చేసి దానిని గొప్పగా పదిమంది ముందు గొప్పగా చెప్పుకునేవారు, చేసినమేలు మరచేవాడు, అబద్ధాలతో బ్రతుకు సాగించేవాడు, పారమార్ధికానికన్న, పతనానికే దారిచేసుకుంటున్నవారవుతారు. అధిక ప్రసంగం, అనవసర కోపం, దురభిమానం, స్వార్ధబుధ్ధి, మిత్రద్రోహం, త్యాగలక్షణాలు లేనివాళ్ళను, ఈ లక్షణాలు కత్తులై, మానవుని ఆయుర్దాయాన్ని నరుకుతుంటాయ్. బుధ్ధిమంతులు వీటినన్నింటిని తెలుసుకుని తగు విధంగా ప్రవర్తిస్తే, దురాత్ములు గేలిచేస్తూ, తమ జీవితాలను అధోలోకాల వైపు సాగిస్తుంటారు. ఎవరికైనా జూదం కలహహేతువు. అందులో అన్నదమ్ముల మధ్య మరీ ప్రమాదకరమని ముందే చెప్పారు. ఎంతసేపు సరదా, సరదా అని ప్రోత్సహించి, మంచి చెప్పినా వినని మనస్తత్వంతో ఇంతవరకు తీసుకువచ్చారు. సిమ్హాలను కాదని నక్కలను చేరదీస్తే, ఎలా ఉంటుందో మన పరిస్థితి అలా తయారయ్యింది
రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే, సేవకుల కష్టసుఖాలను గమనించాలే తప్ప, పరద్రవ్యానికి, సంపదలకు పరుగులు పెట్టకూడదు. ప్రభుత్వ పనితీరు బాగుండాలంటే సరయిన మంత్రాంగం ఉండాలి. మంత్రుల కష్టసుఖాలను తప్పక గమనించాలి. రాజ్య రక్షణ సక్రమంగా జరగలంటే, ఉద్యోగులు ప్రభు భక్తి పరాయణులు అయ్యుండాలి. ఆదాయవ్యయాలు సరిచూసుకుంటూ, సేవలకు తగు రీతిని స్పందించి, తగిన వేతనాలివ్వాలి. రాయబారులు అన్నిట సర్వసమర్ధులుగా ఉండాలి. ఎటువంటి ప్రలోభాలకు లొంగని వారు, అహంకార శూన్యులు, దయాహృదయులు, నిర్మల మనస్కులు, ఎటువంటి కార్యాన్నైనా చాకచక్యంగా చేసుకురాగలవారు -- ఇటువంటి వారిని మనం దూతలుగా నియమించాలి. అశక్తులు, అనారోగ్యులని రాయబారులుగా నియమించకూడదు. మితాహారం, నిత్రపరిశుభ్ర స్నానం, ఏకాగ్రచిత్తం, ఆసనాలు, శరీరాన్ని ఆరొగ్యవంతం చేస్తాయి. వీరికి పుట్టే పిల్లలు కూడా అరోగ్యమూర్తులై ఉంటారు.
సోమరులను, మాయమాటల్ని చేప్పేవారిని, కలహప్రియులను, అతిగా తినేవారిని, అతిజుగుప్సాకర వస్త్రధారణను చేసేవారిని సభ్యసమాజానికి దూరంగా ఉంచాలి. మూర్ఖులను, నీచులను, కృతఘ్నులను, శత్రువును ఏ స్థితిలోను సహాయం అడుగరాదు. అబద్ధాలాడేవారిని, చపలచిత్తులను, దురభిమానులను దూరంగా పెట్టాలి. పుత్రులకు ఉపాధి కల్పించాలి. పుత్రికలకు తగిన యోగ్యుడనవానితో వివాహం జరిపించి, బాధ్యతలు తీరాయనుకోవడం కాదు. తరువాత వానప్రస్ఠాశమ్రాన్ని స్వీకరించాలే తప్ప భౌతిక విషయలంపటులై బ్రతుకకూడదు.
(ఇంకా ఉంది )

No comments:

Post a Comment