Friday, 11 September 2015

విదుర నీతి 21
నిగ్రహం వలన కలిగే ప్రయోజనాల గురించి విదురుడు ఇలా చెప్తున్నాడు.
మనోనిగ్రహం మహాదుర్లభం అనునది అక్షర సత్యం. చెడు ఉద్దేశ్యాలున్న వాడికే కాక మంచి ఉద్దేశ్యాలు ఉన్నవాడికీ మనసును నిగ్రహించుకోవలసిన అవసరం ఎంతో ఉంటుంది. మనిషిలోని స్వార్థగుణం, అహం, అసూయ, దు"ఖ వంటి గుణాలే కాక మంచితనం, పరోపకారబుధ్ధి, త్యాగగుణం, సంతోషం వంటివి కూడ వ్యక్తి నిగ్రహాన్ని కోల్పోయేలా చేస్తుంటాయి. మొదట తెలిపిన వాటివల్ల మనవల్ల ఇతరులకు నష్టం కలిగితే, రెండవరకం గుణాల వల్ల మనమే మోసఓవచ్చు. అందువలన ఏ సమయంలోనైనా మానసిక నిగ్రహం కలిగి ఉండాలి. మనలో మనం తర్కించుకుని ఉచితమనుకున్నదానినే ఆచరించాలి. అంతేతప్ప ఏ స్వార్ధ ప్రలోభానికో, అమాయకత్వానికో లోను కాకూడదు. మన స్వార్ధబుధ్ధివలన ఇతరులు కష్టాలపాలు కాకూడదు. అలాగే ఇతరులు తమ స్వార్ధానికి మనలను ఉపయోగించుకోకుండా అప్రమత్తులమై ఉండాలి.
నిగ్రహం అలవరచుకున్నవారు పొరపాట్లు చేయరు. అట్టివారి జీవితం ఎటువంటి ఒడిదుడుకులకు లోనుకాకుండా సాఫీగా సాగుతుంది. యోగామొదలైన వాటివలన కలిఫే విశ్రాంతి తాత్కాలిక ప్రయోజనకరమే. నిజమైన నిగ్రహం మనతర్కబుధ్ధివలనే సాధ్యపడుతుంది. చక్కని వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నపుడు వాస్తవంగా నిగ్రహం సాధ్యపడుతుంది. నిగ్రహం చూపడం అంటే లోపలి భావాలను పైకి కనిపించకుండా అణచివేయడం కాదు. సత్యాన్ని గ్రహించే శక్తిని మన వ్యక్తిత్వం కలిగి ఉండడం.
ఈ ప్రపంచాన్నే జయించి 'మానవోత్తముడూ కావటానికి ఎవరైనా 12 గుణాలను అలవరుచుకోవాలి.
1.జ్ఞానము --తెలియనిది తెలుసుకోవడం.
2. సత్యము -- విశ్వహితమైన యదార్ధము పలుకుట.
3. దమము-- మనోనిగ్రహము.
4. శృతము-- ఆధ్యాత్మిక శాస్త్రము వినుట లేదా మంచి మాటలు వినుట.
5. అమాత్వర్యము --జీవుల యందు ద్వేషము లేకుండుట.
6.హ్రీ: -- అకార్యము చేయుటకు సిగ్గుపడుట.
7. తతిక్షా --శీతోష్ణాది ద్వందములను సహించుట.
8. అనసూయ -- అసూయ లేకుండుట.
9. యజ్ఞము -- అగ్నిష్టోమాది మహాయజ్ఞములు.
10. దానము --పాత్రత ఎరిగి అవసరమైన వారికి దానము చేయుట.
11. ధృతి-- ఇంద్రియ నిగ్రహము
12. శమము -- అంతరింద్రీ నిఘ్రహము.
ఈ లక్షణాలన్నీ కలిగినవారిని జితేంద్రియులు అనడంలో తప్పులేదు.

No comments:

Post a Comment