Friday 11 September 2015

విదురనీతి 27
మనం వైరం, ద్వేషం, శత్రుత్వం, తిరస్కారం, ప్రతీకారాలను పంచితే, అవే ఎన్నోరెట్లు అధికంగా మనకు తిరిగి సంక్రమిస్తాయి. ఒకవేళ తీర్థయాత్రలన్నీ చేసినా, జపతపాలు చేసినా లోలొని కర్కశత్వం, కాఠిన్యం, నిర్దయం మనలో తొలగిపోకుంటే ఆ యాత్రలూ, జపతపాలన్నీ, బహిర్గతంగా ఉంటాయే తప్ప మన హృదయంలో వాటి ఫలితాలతో పవిత్రమొందదు.
కామం వల్ల గానీ, భయం వల్ల కానీ,లోభం వల్ల కానీ, ప్రాణాలను రక్షించుకోవడానికి కానీ, ధర్మాన్ని విడనాడరాదు. ధర్మం నిత్యమైనది. సుఖదు:ఖాలు అనిత్యాలు. జీవాత్మ నిత్యం కానీ దాని కారణభూతమైన ఉపాధులు మాత్రం అనిత్యం.
కామం లోభం మనిషిని పతనదిశవైపు మళ్ళిస్తాయి. దేహాన్ని సుఖపెట్టడమే జీవిత ప్రమావధిగా భావించేవాడు ఆత్మ సంతృప్తినిచ్చే కార్యాలను నెరవేర్చలేడు. దేవుడిచ్చిన స్వేచ్చను దుర్వినియోగం చేసినవాడు చివరకు చింతించకమానడు. విశాల దృక్పథం, ఔదార్యం వంటి సుగుణాలను అలవరచుకుంటే వ్యక్తిత్వం పరిణతి చెందుతుంది. పరిణతి చెందిన వ్యక్తిత్వానికి దు:ఖమన్నదే ఉండదు. అటువంటి వారికి ఆత్మసాక్షాత్కార భాగ్యం తప్పక కలుగుతుంది.
మహాత్ములు పలికిన ఈ పలుకుల లోని హితాన్ని అవగాహన చేసుకుని, ఆ భావాన్ని మనసులో ప్రతిష్టించుకుని తదనుకుణంగా నడచుకోవాలి. అలాంటి కొన్ని మంచి మాటలు.
1. ఈ మూడు విషయాలలో జాగ్రత్తగా ఉండు:
1. నిన్ను నీవు పొగడుకొనుట 2. పరనింద 3. పరుల దోషాన్ని ఎంచుట.
2. ఈ మూడింటిని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో..
1. ఈశ్వర స్మరణ 2. పరులను గౌరవించుట 3. నీలోని దోషాలను కనిపెట్టుట.
3. ఈ మూడింటిని ఆచరించు!
1. సత్యము 2. అహింస 3. ప్రేమతత్వము
4. ఈ మూడింటికి దూరంగా ఉండు!
1.ఇతరుల గురించిన చర్చ, 2. వాద వివాదాలు , 3 నాయకత్వం.
5. ఈ ముగ్గురి పట్ల దయతో ఉండు!
1. అబల 2. పిచ్చివాడు, 3. దారితప్పిన వాడు.
6. ఈ మూడింటి పట్ల దయతలచవద్దు!
1.పాపము 2. కామేంద్రియము 3. నాలుక
(ఇంకా ఉంది )

No comments:

Post a Comment