Monday, 14 September 2015

విదురనీతి 41
పొరపాటు చేయటం అనేది మానవస్వభావం. ఆ పొరపాటును తెలుసుకొని ఇక ముందు అలాంటి పనులు చేయనని, దృఢంగా అనుకుని మంచి మార్గంలో నడవడమే జ్ఞానమున్న వ్యక్తి ఆచరింపదగిన ధర్మం. అదే ప్రాయశ్చిత్తం. పాపంచేసిన వ్యక్తి దానినుండి బైటపడడానికి మార్గాలు ఉన్నాయి. చేసిన తప్పును దాచకుండా ఉన్నది ఉన్నట్లు ఇతరులతో చెప్పడం వలన, జరిగిన దానిని గుర్తించి ఖేదపడడం వలన దోషవిముక్తి కలుగుతుంది.
కోరికలు మనిషిని మానవత్వం నుంచి దానవత్వానికి దిగజారుస్తాయి. మనస్సును అదుపులో పెట్టుకోవడానికి సంతృప్తియే ఏకైక మార్గం.
మానవుడు వ్యక్తి పురోభివృధ్ధికీ, సంఘ పునరుజ్జీవనానికీ దారితీసేలక్షణాలు కలిగి ఉండాలి. అవి ఏమిటంటే ఉత్సాహంతో కూడిన క్రియాసీలత, మొక్కవోని ధైర్యం, శక్తి ఉత్సాహాలు, వీటన్నింటికీ మించి పరిపూర్ణమైన విధేయత ముఖ్యం. ఎవరైతే సద్గుణాలు అలవరచుకుని తన జీవన గమనాన్ని మలుచుకుంటారో వారు వినయ విధేయతల వలన అందరికీ ఆదర్శప్రాయులవుతారు.
ఇవి ఒక్క ధృతరాష్ట్రునికే కాదు, మానవజన్మ ఎత్తిన ప్రతివారు తెలుసుకోదగ్గవి. ఆచరించి తరించదగ్గవి. చెప్పేటప్పుడు వినక, ఆనక చెప్పేవారు లేరని ఏడవడం తగదు. కాలమాన పరిస్థితులను బట్టి, బాధ్యతలు, బరువులు పెరుగుతుండటమో, మారుతుండటమో జరుగుతున్నాయి. కానీ, కాలం మారడం లేదు. ధర్మం మీరడం లేదు. అందుకనే విచక్షణను ప్రసాదించిన పరమాత్మ, వివిధ మార్గాలతో ధర్మప్రబోధం, ప్రకాశం చేస్తూ తరించమంటున్నాడు. అందుకే దీనిని మహామహుడైన పరిపూర్ణ ధర్మస్వరూపమైన యమధర్మరాజు, తరించే జ్ఞానవిజ్ఞానాలు ప్రసాదించిన దివ్య విదురునిగా ప్రకాశం, తత్వసారాంశం గ్రహిస్తే మనం ధన్యులం.
(ఇంకా ఉంది )

No comments:

Post a Comment