Friday, 11 September 2015

విదురనీతి 7
రాయబారం నుంచి వచ్చిన సంజయుడు ధృతరాష్ట్రునితో పల్కిన పలుకులు..
ఈ దారుణ పరిస్థితి ఏర్పడడానికి ముఖ్యంగా కారణం మీరు. పిల్లలమీద ప్రేమ ఉండటంలో తప్పు లేదు. తప్పకుండా ఉండాలి. ఎటొచ్చి, అది విపరీతం కారాదు. వెర్రివ్యామోహం అసలే కారాదు. ఎంతసేపు ఎలాగ చూసినా అన్యాయం మనవైపు, న్యాయం వారివైపు స్పష్టంగా కనబడుతుంది. మనం వారిని కట్టడి చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాము. మరి వారో..నిర్మల పరిశుధ్ధ మనసుతో దయ, ప్రేమలు కురిపిస్తూ ధర్మపరులై ప్రకాశిస్తున్నారు. మనం చేసిన అకృత్యాలు, ఆగడాలు అవతలవారిని రెచ్చగొట్టి పగ, పట్టుదలలు రేపుతున్నాయి. ఎంతటి ధర్మాత్ములైనా అధర్మాన్ని ఆదరించలేరు. మీకు ధర్మమంటే తెలియదు. ఎంతసేపు "నా పిల్లలు, పాండుపుత్రులు " అంటూ బేధభావంతోనే చూస్తున్నారు కానీ, ఇప్పుడు నేను, నా పిల్లలు అనుభవించే సర్వస్వము, నా తమ్ముడు పాండురాజు "దయాభిక్ష" అని ఏనాడైనా తలచారా? లేదు. దొరికినదానిని, అర్హతలేకపోయినా అందలం ఎక్కి కూర్చుని, మీ పిల్లలకు హక్కు-భుక్తంగా ప్రవర్తిస్తున్నారు. దీనివలన మీపై ప్రజలకు, అధికారులకు, అందలమెక్కించిన భీష్మాదుల ప్రేమ-గౌరవం-మర్యాద-మన్ననలు పొందలేక, నిరాదరణకు, కోపతాపాలకు గురి అవుతున్నారు. ఇది ఇక్కడితో పోవడం లేదు. దీనివలన మీ పితృపితామహులు కూడా నరకమార్గానికి సాగిపోతున్నారు.
కౄరులు, నీచులు, హీనులు, ధర్మశూన్యులు తమ పాపఫలాలను అనుభవించక తప్పదు. ఇప్పుడు పొందేవన్నీ తాత్కాలిక సుఖాలు. అనుభవించాల్సినవన్నీ యుగాంతపర్యంత నరకబాధలు. ఎంతసేపు, సుఖాలు, సంపదలు, అధికారాలు...మీ అంధత్వంతో, అవతలి వారిని ఎదుగనీయని స్వార్ధంతో మీ పిల్లలను పెంచారు. దీనివలన కురువంశ ప్రతిష్టకు, మీ భౌతిక, మానసిక గిడ్డితనానికి మీ స్వార్ధం వలన శాశ్వతంగా లభించే భయంకర దారుణాలకు, వ్యధలకు దారి చేసుకున్నట్టయింది.
తప్పులు సరిదిద్దగలిగీ, పుత్రవ్యామోహంతో సహకరించిన సర్వదారుణాలకు ఫలం దారుణంగానే ఉంటుంది. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే నీ కొడుకుల దురాలోచన, దూరాలోచన లేని దుష్ట ప్రయత్నాలు....అందుకు తగినట్టు నీ కొడుకును రెచ్చగ్ఫొట్టే కర్ణ, శకునులు. ఒక్కసారి నిస్వార్ధ, నిష్కపట దృష్టితో పాండవుల గూర్చి ఆలోచించండి. వారు ఎన్నడైనా మీకు గాని, మీ పిల్లలకు గాని తెలిసికాని, తెలియక గాని అపకారం చేసారా? లేదే, ఇదంతా స్వయంకృతాపరాధం. చిన్ననాడే ఉభయులను ఏకదృష్టితో చూస్తూ ఏకసంతానంగా భావిస్తే ఈ అనర్ధం వచ్చేది కారు. మీ మూర్ఖత్వమే నేడు మారణకాండకు దారితీసింది.
ఇది కేవలం కురు-పాండావులకు సంబంధించినదిగా లేదు. ఎందరో మహనీయులు, మరెందరో సైన్య, ప్రజలతోపాటు, తమను అనుసరించేవారు, ఆశ్రితులు కూడా అనవసరంగా నాశనమై పోతున్నారు. ఎందరో ప్రజానాశనానికి వచ్చిన ఈ దారుణాన్ని ఆపండి. ధర్మం నిలపండి.
సంజయుడి మాటలు విన్న ధృతరాష్ట్రునికి రాత్రి నిద్రపట్టలేదు. సంజయుడు అక్కడి విషయాలను మరునాడు సభలో చెప్తాను అన్నాడు. అక్కడ ఏమి జరిగిందో, సభలో ఏమి చెపుతాడో అనే కలతతో నిద్ర కరువైంది. నాలుగు మంచి మాటలు వినడం కోసం ఆ రాత్రి పూట విదురునికి కబురుపెట్టాడు. విదురుడు రాగానే, నిద్ర రావడంలేదు అని, నాలుగు మంచి మాటలు చెప్పి తన మనసుకు శాంతి కలుగచేయాలనీ కోరాడు. మహారాజు పర్స్థితిని అర్ధం చేసుకున్న విదురుడు అంతా స్వయంకృతాపరాధంగా తలచి, తలఊపి, "మహారాజా! మీకు నిద్ర రాకపోవడానికి కారణం నాకు అర్ధం కావడం లేదు. అలసిపోయినవారికి, ప్రశాంతమనస్కులకు, సర్వజన సంక్షేమం కోరేవారికి, పెద్దలయందు, ధర్మ నీతి కుశలురయందు గౌరవభావం కలవారికి, ధర్మవర్తనులకు, ధర్మమూర్తులకు అంతా శుభమే తప్ప ఏ విధమైన ఇబ్బందులు రావు. ఇందులో ఏది లోపించినా ప్రమాదాలు, కంటికి కునుకు లేకపోవడాలు...." అంటూ విదురుడు సధ్ధర్మమూర్తిగా తనకు తెలిసిన ధర్మాలను తెల్లియచేయ సిధ్ధపడుతున్నాడు.
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment