Friday 11 September 2015

విదుర నీతి 29
పాపపుణ్యాల విచక్షణ :
మానవులు ఎలాంటి పుణ్యకార్యాలనూ చేయడానికి ఇష్టపడరు. కాని పుణ్యఫలాన్ని మాతం ఆశిస్తారు. పాపఫలితాన్ని ఆశించరు. కాని పాపకార్యాలను మాత్రం ప్రయత్నపూర్వకంగానే చేస్తారు.--అని ధర్మ నీతి శాస్త్ర నిర్వచనం.
ఇంతకీ పాపం అంటే ఏమిటి? పుణ్యం అంటే ఏమిటి?
" పరోపకారాయ పుణ్యాయ, పాపయ పరపీడనం"..అంటే, ఇతరులకు చేసిన మేలు పుణ్యం అనీ, ఇతరులను పీడించడం వలన పాపం సంక్రమిస్తుంది అనీ శాస్త్రవచనం.
పూర్వజన్మల్లో చేసిన పాపదోషాలవల్లనే ఈ జన్మలో శారీరక, మానసిక వ్యాధులు వచ్చి పీడిస్తున్నాయి అని మనం గ్రహించాలి. పాపం వలననే దు:ఖాలు వస్తాయి. పాపము లేనప్పుడు ఆనందం కలుగుతుంది. ఏకొంచెం దు:ఖం కలిగినా అది పాప ఫలమే కాక వేరొకటి కాదు. పాపదోషం అనుభవించితే తప్ప పోదు.
అడవుల్లో ఉన్నపుడు, యుధ్ధంలో శత్రువుల మధ్య, నీటి మధ్య, అగ్నిమధ్య ఉన్నపుడు, సముద్రంలో సాగుతున్నపుడు, పర్వత శిఖరాలను ఎక్కుతున్నప్పుడు, నిద్రలో, అజాగ్రత్తలో , సంకటపరిస్థితులలో మానవుడిని తాను పూర్వ జన్మలో చెసిన పుణ్యాలే కాపాడుతాయి.
"ఒరులేయని యొనరించిన
నరవర యప్రియము తన మనంబునకగుదాన్
ఒరులకు నవి సేయకునికి
పరాయణము పరమధర్మ పధములకెల్లన్"
"ఇతరులు తనయందు ఏ విధంగా ప్రవర్తిస్తే, తన మనస్సు కలత చెందుతుందో అదే విధమైన ప్రవర్తనను ఇతరుల యందు నీవు కలిగియుండకుండుటే అన్ని ధర్మములలోకి కూడా ఉత్తమమైన ధర్మము". అని విదుర వాక్కు.
పుణ్యం చేయడం చేతకాకున్నప్పటికీ ఈ ధర్మాన్ని ఆచరిస్తే చాలు.
ఈ లోకంలో పుణ్యం కాని, పాపం కాని, ఇతరుల నుంచి మనం తీసుకోలేము. తాను చేసిన పాపకర్మవల్లనే దు:ఖం కలుగుతుంది. తాను చేసిన పుణ్య కర్మ వల్లనే సుఖము కలుగుతుంది. ఈనాడు నవ్వుతూ చేసిన పాపకర్మకి రేఉ ఏడుస్తూ దు:ఖాన్ని అనుభవించకతప్పదనే సత్యాన్ని మన గ్రహించాలి.
(ఇంకా ఉంది )

No comments:

Post a Comment